లైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందా

విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా ఏదో అద్భుతం చేస్తుందనుకుంటే పూర్తి రివర్స్ లో సూపర్ ఫ్లాప్ అయ్యింది. కానీ ఇలాంటి కంటెంట్ ఎంచుకున్నందుకు స్వయంగా అభిమానులే విమర్శించారు. మాములుగా ఏదో ఒక సందర్భంలో యాక్టివ్ గా బయట కనిపించే విశ్వక్ సేన్ ఈ లైలా దెబ్బకే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఫంకీ మీద పూర్తి దృష్టి పెట్టాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనుదీప్ దర్శకత్వంలో రూపొందించిన ఈ ఎంటర్ టైనర్ లో కయదు లోహర్ హీరోయిన్ గా నటించింది. ఫైనల్ కాపీ రెడీ చేస్తున్నారు.

టైటిల్ కు తగ్గట్టే రిలీజ్ డేట్లతో ఫంకీ కామెడీ చేస్తోంది. గతంలో ఫిబ్రవరి అన్నారు. తర్వాత లేదు లేదు ఏప్రిల్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరి 13 అంటూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈసారైనా మాట మీద ఉంటారో లేక అనుదీప్ స్టైల్ లో ఏదైనా ట్విస్టు ఇస్తారో చూడాలి. విశ్వక్ సేన్ కి ఇది హిట్ కావడం చాలా కీలకం. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ రిస్క్ లో పడింది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి టైంకి ఇప్పటికీ పోల్చుకుంటే డౌన్ ఉంది. ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఫంకీ సాలిడ్ బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఈ ప్రాజెక్టు మీద అంత నమ్మకం పెట్టుకున్నాడు.

అలాని తన చేతిలో సినిమాలు లేవని కాదు. కావాల్సినంత దర్శక నిర్మాతలున్నారు. కానీ హిట్టు పడకపోతే ఎన్ని చేసినా లాభముండదు. ముఖ్యంగా లైలా లాంటి గాయాలకు మందు పూయాలంటే సక్సెస్ పట్టాల్సిందే. దర్శకుడు అనుదీప్ కి సైతం ఫంకీ కీలకం కానుంది. జాతిరత్నాలుతో సెన్సేషన్ సృష్టించిన ఈ యూత్ డైరెక్టర్ శివ కార్తికేయన్ తో ప్రిన్స్ రూపంలో పరాజయం చూశాక చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో రవితేజ సినిమా చేతి దాకా వచ్చి జారిపోయింది. ఆ స్థానంలోనే విశ్వక్ సేన్ వచ్చి చేరాడు. వచ్చే ఏడాది నుంచి నెలకో హిట్ ఇస్తానని చెప్పిన నిర్మాత నాగవంశీకి ఫంకీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.