టికెట్ రేట్ల పెంపు – అంతులేని కథ

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ముగింపు లేని కథగా మారుతోంది. అఖండ 2 జిఓని రద్దు చేస్తూ నిన్న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని విజయ్ గోపాల్ అనే న్యాయవాది వేసిన పిటీషన్ కు స్పందించిన న్యాయస్థానం బుక్ మై షో సిఈఓకి, హోమ్ సెక్రెటరి సివి ఆనంద్ కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాలకు విచారణ వాయిదా వేసింది. దీనికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ ఇకపై ధరల పెంపు కోసం దర్శక నిర్మాతలు తన దగ్గరికి రావొద్దని, ప్రజల పక్షాన ఉండే తమ ప్రభుత్వం ఇకపై ఎలాంటి అనుమతులు ఇవ్వదని, ఇప్పుడు జరిగింది పొరపాటని చెబుతూ కొత్త ట్విస్టు ఇచ్చారు.

గతంలో ఓజి సమయంలోనూ మంత్రి ఇంచుమించు ఇదే తరహాలో స్పందించారు. పుష్ప రిలీజ్ టైంలో సంధ్య థియేటర్ ఘటన జరిగినప్పుడూ హైక్స్ ఉండవని చెప్పారు. కానీ ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది. ఇంకో నెల రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు లాంటి వాటికి పెంపు ఇవ్వకపోతే ఇబ్బంది. కానీ మినిస్టర్ గారేమో సమస్యే లేదంటున్నారు.ఎఫ్డిసి చైర్ మెన్ గా ఉన్న దిల్ రాజు ఈ విషయంలో చొరవ తీసుకుని ఏదైనా పరిష్కారానికి పూనుకుంటారేమో చూడాలి. ఇక్కడ కొన్ని కోణాలను నిశితంగా పరిశీలించాలి.

నైజామ్ లో ఎలాంటి పర్మిషన్లు అవసరం లేకుండా గరిష్టంగా మల్టీప్లెక్సులు 295, సింగల్ స్క్రీన్లు 175 రూపాయలు టికెట్ రేట్ పెట్టే వెసులుబాటు ముందు నుంచి ఉంది. ఏపీతో పోల్చుకుంటే 70 నుంచి 100 రూపాయల దాకా ఇది ఎక్కువ. అయినా సరే ఇంకా కావాలని పెద్ద నిర్మాతలను గవర్నమెంట్ ను విన్నవించుకుంటున్నారు. సరేలెమ్మని సర్కారు అనుమతులు ఇచ్చేస్తోంది. ఇప్పుడు దీనికి సొల్యూషన్ కావాలంటే పెద్దలందరూ ఒక చోట చేరి మాట్లాడుకోవాలి. రెమ్యునరేషన్లు పెంచుకుంటూ పోతూ దాన్ని ఆడియన్స్ మీదకు తోసేయడాన్ని మంత్రి తప్పుబడుతున్నారు. ఆయన అన్నదాంట్లోనూ లాజిక్ ఉంది.

పదే పదే కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలం వృథా చేసుకుంటూ అందరినీ టెన్షన్ పెట్టే కంటే దీనికి ముగింపు పలకడం అత్యవసరం. ఇవాళ తెలంగాణ, రేపు ఎవరో ఒకరు ఆంధ్రప్రదేశ్ లో కేసులు వేస్తే ఏపీలోనూ ఇదే రిపీట్ అవుతుంది. అక్కడిదాకా రాకముందే డిప్యూటీ సిఎం సూచించినట్టు ఒక కమిటీ ఏర్పడి మార్గదర్శకాలు రూపొందించుకోవాలి. నాకు తెలియకుండా జరిగిపోయిందని మంత్రి అంటున్నారు అంటే సిస్టమ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా చూస్తున్న ఆడియన్స్ మాత్రం ఏదో ఒకటి ఫిక్స్ చేసి ఇది మళ్ళీ జరగకుండా చూడమని కోరుతున్నారు. అయితే అదంత ఈజీ కాదు.