తండ్రి అలా… హృతిక్ ఇలా

హృతిక్ రోష‌న్‌కు డెబ్యూ మూవీ క‌హోనా ప్యార్ హై త‌ర్వాత పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా.. కోయీ మిల్ గ‌యా. దీనికి కొన‌సాగింపుగా వ‌చ్చిన క్రిష్‌, క్రిష్‌-3 కూడా ఘ‌న‌విజ‌యం సాధించాయి. ఈ ఫ్రాంఛైజీలో భాగంగా మ‌రింత భారీగా క్రిష్‌-4 చేయ‌డానికి చాలా ఏళ్ల ముందే స‌న్నాహాలు మొద‌లుపెట్టాడు హృతిక్ తండ్రి, ద‌ర్శ‌కుడు రాకేష్ రోష‌న్.  ఈ చిత్రానికి ఎప్పుడో స్క్రిప్టు కూడా రెడీ అయింది. కానీ ఇప్ప‌టిదాకా ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కలేదు. మధ్యలో రాకేష్ క్యాన్సర్ బారిన పడడం వల్ల ఈ ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. ఆయన కోలుకుని సినిమా తీయడానికి రెడీ అయ్యారు. 

అయినా క్రిష్-4 కార్యరూపం దాల్చలేదు. అందుకు కారణమేంటో ఆ మ‌ధ్య‌ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు రాకేష్ రోషన్. బడ్జెట్ సమస్యల వల్లే క్రిష్-4ను సెట్స్ మీదికి తీసుకెళ్లలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. క్రిష్-4ను అంతర్జాతీయ ప్రమాణాలతోనే తీయాల్సి ఉంటుందని.. అందుకోసం భారీ బడ్జెట్ అవసరమని.. కానీ తాము అనుకున్న బడ్జెట్‌లో సినిమా తీయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని ఆయన వెల్లడించారు.

మ‌ధ్య‌లో హృతిక్ రోష‌న్ స్వ‌యంగా ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి కానీ.. ఇప్ప‌టిదాకా ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్ల‌ట్లేదు. కార‌ణం ఆర్థిక స‌మ‌స్య‌లే అని తెలుస్తోంది. ఐతే ఇంత‌కుముందు క్రిష్ సిరీస్‌లో వ‌చ్చిన మూడు సినిమాల‌నూ రోష‌న్ ఫ్యామిలీనే నిర్మించ‌డం గ‌మ‌నార్హం. కానీ క్రిష్‌-4 మీద డ‌బ్బులు పెట్ట‌లేక‌పోతోంది. ఐతే హృతిక్ తండ్రి ఈ విష‌యంలో ఇబ్బంది ప‌డుతుండ‌గా.. హృతిక్ మాత్రం సొంతంగా భారీ పెట్టుబ‌డులు పెడుతుండడం విశేషం. 

తాజాగా అత‌ను ముంబ‌యిలోని జుహులో ఒక ప్రీమియం ప్రాప‌ర్టీ కొన్నాడు. రెండు ఫ్లోర్ల‌తో ఉన్న ఆ ప్రాప‌ర్టీ కోసం అత‌ను ఏకంగా రూ.27 కోట్లు వెచ్చించాడ‌ట‌. 7 వేల చ‌ద‌ర‌పు అడుగుల ల‌గ్జ‌రీ ప్రాప‌ర్టీ ఇద‌ని స‌మాచారం. ఓవైపు క్రిష్‌-4 తీయ‌డానికి డ‌బ్బులు స‌మ‌కూర‌ట్లేద‌ని రాకేష్ బాధ ప‌డుతుంటే.. హృతిక్ ఇలా ల‌గ్జ‌రీ ప్రాప‌ర్టీ కొన‌డం బాలీవుడ్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. ఐతే క్రిష్ సిరీస్‌లో ఇప్ప‌టిదాకా తీసిన సినిమాలు వేరు.. క్రిష్‌-4 వేర‌ని తెలుస్తోంది. దాని కోసం వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెట్టాల్సి రావ‌డంతో హృతిక్ మార్కెట్ దృష్ట్యా అంత బ‌డ్జెట్ పెట్ట‌డానికి వేరే నిర్మాత‌లు ముందుకు రాలేద‌ని తెలుస్తోంది.