ధనుష్ ముందు జాగ్రత్త పడాల్సింది

తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న ధనుష్ ఈ మధ్య ఇడ్లి కొట్టుతో ఇక్కడ ఫ్లాప్ చూశాడు కానీ మార్కెట్ అయితే మరీ జీరో స్థాయిలో లేదు. తన సినిమా వస్తుందంటే కొనే బయ్యర్లు, చూసే ప్రేక్షకులు ఉన్నారు. కంటెంట్ సరిగా కుదరాలి అంతే. మాములుగా అయితే ధనుష్ ప్లానింగ్ అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ ఉండేలా జరుగుతుంది. కానీ ఈసారి ఇది మిస్సయ్యింది. బాలీవుడ్ మూవీ తేరే ఇష్క్ మేని అమర కావ్యంగా డబ్బింగ్ చేసి ప్రకటన కూడా ఇచ్చారు కానీ తెలుగు వెర్షన్ థియేటర్లలో అడుగు పెట్టలేదు. బహుశా వచ్చే వారం చేస్తారేమో కానీ అఖండ 2 తాకిడిలో నిలబడి తట్టుకోవడం అంత ఈజీ కాదు

ప్రస్తుతానికి తేరే ఇష్క్ మే టాక్ డీసెంట్ గా వినిపిస్తోంది. ఏఅర్ రెహమాన్ సంగీతం, హీరోయిన్ కృతి సనన్ తో ధనుష్ కెమిస్ట్రీ, ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం, ఇంటెన్స్ కంటెంట్ వగైరాలు విమర్శకులను మెప్పిస్తున్నాయి కానీ కామన్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. కథపరంగా చూసుకుంటే ఇదో లవ్ స్టోరీ. శంకర్, యుక్తి అనే జంట మధ్య చెలరేగే తీవ్ర భావోద్వేగాలను దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కథావస్తువుగా తీసుకున్నారు. వారణాసి బ్యాక్ డ్రాప్ తో పాటు ధనుష్ కు కొంచెం నెగటివ్ షేడ్ పెట్టడం డిఫరెంట్ గా అనిపించాయి. సెకండాఫ్ లో ఊహించని ట్విస్టులు ఉన్నాయట.

సరే కొంచెం ముందు జాగ్రత్త పడి ఉంటే ఇవాళ తెలుగు ప్రేక్షకులు కూడా చూసేవాళ్ళు. అసలే అమర కావ్యం అంటూ ఓల్డ్ స్టైల్ లో టైటిల్ పెట్టారు. దీంతో మాస్ ని రప్పించడం కష్టం. టార్గెట్ కూడా ఎక్కువ క్లాసే కావడంతో బహుశా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఇప్పుడు హిందీలో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఒకేసారి అయ్యుంటే బాగుందనేది ధనుష్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఆంధ్రకింగ్ తాలూకా పాజిటివ్ టాక్ తో వెళ్తున్నప్పటికీ ఇంకో సినిమాకు బాక్సాఫీస్ వద్ద స్కోప్ ఉండేది. కానీ టైం చాలాకపోవడం, సెన్సార్, ప్రమోషన్లు తదితర కారణాల వల్ల అమరకావ్యం టైంకి రాలేదని ఇన్ సైడ్ టాక్.