ఒకపక్క నాలుగు వారాల థియేటర్ విండో పట్ల డిస్ట్రిబ్యూటర్లలో వ్యతిరేకత ఉంది. రిలీజైన నెల రోజులకే ఓటిటిలో రావడం వల్ల రెవిన్యూ తగ్గుతోందని పలు సందర్భాల్లో తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కానీ, థియేటర్ లైఫ్ తగ్గిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడిని సేఫ్ చేసుకోవడం కోసం నిర్మాతలకు వేరే ఆప్షన్ ఉండటం లేదు. సరే ట్రెండ్ అలా ఉంది కాబట్టి ఎవరేం చేయలేరనుకున్నా మరీ వారం గ్యాప్ అంటే ఖచ్చితంగా షాక్ ఇచ్చేదే. రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ పాంచ్ మినార్ హఠాత్తుగా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. గత శుక్రవారమే ఇది థియేటర్లో అడుగుపెట్టింది. కొంచెం డీసెంట్ టాక్ వచ్చింది కానీ నిలబడలేదు.
రాజ్ తరుణ్ మార్కెట్ ఎప్పుడో రిస్క్ లో పడింది. వరస ఫ్లాపులు తనకు ప్రేక్షకులకు మధ్య దూరం పెంచాయి. ఓటిటిలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కానీ పెద్దగా పనవ్వలేదు. సరే ఒక హిట్ దక్కితే మళ్ళీ రేస్ లోకి రావోచ్చనుకుంటే ఇదిగో ఇలాంటి ఫలితాలు ఎదురవుతున్నాయి. పాంచ్ మినార్ చిన్న పాయింట్ తో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందింది. రాజ్ తరుణ్ గత సినిమాలతో పోలిస్తే బెటరనే అభిప్రాయం వినిపించింది. కాకపోతే అది ఫుట్ ఫాల్స్ గా మారలేదు. అయినా ఈ మాత్రం వారం రోజుల సంబరానికి కష్టపడి థియేటర్ రిలీజ్ చేయడం వెనుక పరమార్ధం అంతు చిక్కడం లేదు.
ఇక్కడ రాజ్ తరుణ్ ప్రాక్టికల్ గా చూడాల్సిన కోణం మరొకటి ఉంది. తన తర్వాత వచ్చిన యూత్ హీరోలు మంచి ప్లానింగ్ తో దూసుకెళ్ళిపోతున్నారు. నవీన్ పోలిశెట్టి, కిరణ్ అబ్బవరంలాంటి వాళ్ళను మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తిరువీర్ సైతం అడపాదడపా హిట్లతో మార్కెట్ లో నిలదొక్కుకునేందుకు ట్రై చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో బాగా వెనుకబడిపోయిన రాజ్ తరుణ్ కంబ్యాక్ కావడం అంటే ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ పడితే కానీ జరగలేదు. ఉయ్యాలా జంపాల, కుమార్ 21 ఎఫ్ లాంటి రెండు మూడు తప్ప ఇంత సుదీర్ఘమైన కెరీర్ లో పెద్దగా హిట్లు లేకపోవడం రాజ్ తరుణ్ పాలిట శాపమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates