పెళ్లిలో ట్రంప్ Jr, జెన్నిఫర్, చరణ్.. ఎవరీ రామరాజు?

అంబానీ పెళ్లిని తలదన్నేలా మరో భారతీయ వివాహం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన మంతెన వారి ఇంట పెళ్లి.. ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు మూలాలున్న నేత్ర మంతెన, వంశీ గాదిరాజుల వివాహానికి ఉదయ్‌పూర్ వేదికైంది. ఈ పెళ్లికి ఏకంగా అమెరికా అధ్యక్షుడి కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ హాజరుకావడం విశేషం. అంతేకాదు, పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్, జస్టిన్ బీబర్, మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి అతిరథ మహారథులు ఈ వేడుకలో తళుక్కున మెరిశారు.

ఇంతకీ ఎవరీ మంతెన రామరాజు? 

పశ్చిమ గోదావరి జిల్లా జువ్వలపాలెంలో పుట్టి, అమెరికాలో ఫార్మా కింగ్‌గా ఎదిగిన వ్యక్తే రామరాజు మంతెన. ‘ఇన్‌జెనుస్ ఫార్మా’కు ఆయన చైర్మన్. 1980ల్లో అమెరికా వెళ్లి, అక్కడ ఫార్మా రంగంలో తనదైన ముద్ర వేశారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుకు అల్లుడు. 2017లో తిరుమల శ్రీవారికి 28 కేజీల బంగారు నెక్లెస్‌ను (సహస్ర నామ కాసుల హారం) బహుకరించి అప్పట్లోనే వార్తల్లో నిలిచారు. ఈయన కుమార్తే నేత్ర పెళ్లి వేడుక ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా హైలెట్ అయ్యింది.

ఇక వరుడు వంశీ గాదిరాజు కూడా సామాన్యుడు కాదు. అమెరికాలో ‘సూపర్ ఆర్డర్’ అనే యాప్‌కు సహ వ్యవస్థాపకుడు. ఫోర్బ్స్ ‘అండర్ 30’ జాబితాలో స్థానం సంపాదించిన యువ పారిశ్రామికవేత్త. కొలంబియా యూనివర్సిటీలో చదువుకున్న వంశీ, టెక్ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం 17వ శతాబ్దానికి చెందిన ఉదయ్‌పూర్‌లోని ‘జగ్ మందిర్ ఐలాండ్ ప్యాలెస్’ను ముస్తాబు చేశారు. 

40 దేశాల నుంచి 126 మంది వీవీఐపీలు ఈ పెళ్లికి వచ్చారు. సంగీత్, మెహందీ వేడుకల్లో బాలీవుడ్ తారలు రణ్‌వీర్ సింగ్, జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, షాహిద్ కపూర్ డ్యాన్సులతో హోరెత్తించారు. రణ్‌వీర్ సింగ్ అయితే ఏకంగా ట్రంప్ జూనియర్‌ను డ్యాన్స్ ఫ్లోర్‌పైకి లాక్కెళ్లి చిందేయించడం హైలైట్. మెహందీలో మాధురీ దీక్షిత్ ‘డోలారే’ పాటకు వేసిన స్టెప్పులు చూసి అతిథులు ఫిదా అయ్యారు.

పెళ్లి రోజున ఇంటర్నేషనల్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ తన పాటలతో స్టేజ్‌ను దడదడలాడించారు. జస్టిన్ బీబర్ రాకతో యువతలో జోష్ పెరిగింది. మన టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అంబానీల పెళ్లి తర్వాత, ఆ స్థాయిలో జరిగిన మరో ఇండియన్ వెడ్డింగ్‌గా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. తెలుగు వారి పెళ్లిలో హాలీవుడ్, బాలీవుడ్, పొలిటికల్ స్టార్స్ కలవడం నిజంగా ఒక అరుదైన దృశ్యం.