కీర్తి సురేష్ పది దోసెల కథ

కీర్తి సురేష్ కెరీర్ ఆరంభంలో ఎలా ఉండేదో.. ఇప్పుడెలా ఉందో గమనిస్తే స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. మొదట్లో కొన్నేళ్ల పాటు బొద్దుగా కనిపించిన ఆమె.. ఇప్పుడు నాజూగ్గా తయారైంది. కొందరికేమో పాత లుక్కే బావుందనిపిస్తే.. ఇంకొందరు ఇప్పుడే బెటర్ అంటున్నారు. మరి కొందరు రెంటికీ మధ్య లుక్ మెయింటైన్ చేస్తే బాగుండు అంటారు. తన లుక్‌లో వచ్చిన ఈ మార్పు గురించి కీర్తి తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించింది.

తాను చబ్బీగా ఉన్నపుడే బాగున్నానని ఇప్పుడు కొందరు అంటుండడం తన దృష్టికి వచ్చిందని కీర్తి చెప్పింది. ఆరోగ్యం, లుక్ విషయంలో తాను అప్రమత్తం కావడం ‘మహానటి’ సినిమాతోనే జరిగిందని ఆమె చెప్పింది. ఆ సినిమా తర్వాతే తాను బరువు తగ్గానని ఆమె చెప్పింది. తాను ఒకప్పుడు పది దోసెలు లేదా పది ఇడ్లీలు తినేదాన్నని.. సరిగా వర్కవుట్లు చేసేదాన్ని కాదని.. అందుకే అంత చబ్బీగా కనిపించేదానన్ని ఆమె తెలిపింది.  

ఐతే ఇప్పుడు కూడా అన్నన్ని దోసెలు, ఇడ్లీలు తింటానని.. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల తాను బరువు పెరగట్లేదని కీర్తి చెప్పింది. తాను ఒక దశలో 10-12 నెలల వ్యవధిలో పది కేజీల బరువు తగ్గినట్లు ఆమె చెప్పింది. బరువు తగ్గడమే కాక నాలుగైదేళ్లుగా స్కిన్ కేర్ మీద కూడా దృష్టిపెట్టానని.. దాని ఫలితమే ప్రస్తుత తన లుక్ అని కీర్తి చెప్పింది. కేవలం నటిగా మంచి పేరు సంపాదిస్తే సరిపోదని.. ఆరోగ్యంగా కనిపించడం కూడా చాలా ముఖ్యమని ఆమె అభిప్రాయపడింది. 

‘మహానటి’ తర్వాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేసిన కీర్తికి.. కోరుకున్న విజయాలు దక్కలేదు. గత ఏడాది పెళ్లి చేసుకున్న ఆమె సినిమాలు కొంచెం తగ్గించింది. తెలుగులో కొత్త సినిమాలు ఒప్పుకోవడానికి టైం తీసుకుంది. ఇటీవలే విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన్’కు సంతకం చేసింది. వేరే సినిమాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఆమె తెలుగు, తమిళ భాషల్లో నటించిన ‘రివాల్వర్ రీటా’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.