ఐబొమ్మ‌కు శాశ్వ‌తంగా తెర‌?

ఐబొమ్మ‌.. తెలుగు వారికి ఇదొక అన‌ధికార ఓటీటీ అని చెప్పొచ్చు. పైర‌సీ సినిమాల‌ను అందించే ఈ వెబ్ సైట్ పెట్టుకున్న ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? వేర్ క్వాలిటీ అండ్ క్లారిటీ మేట‌ర్స్. కొన్నేళ్ల నుంచి తెలుగు చిత్రాల‌తో పాటు తెలుగులో రిలీజ‌య్యే వేరే భాషా చిత్రాల‌ను కూడా పైర‌సీ చేసి క్వాలిటీ ప్రింట్లు అందిస్తూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకుందీ వెబ్ సైట్. మొద‌ట్లో డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చే సినిమాల‌ను మాత్ర‌మే పైర‌సీ చేసి అందిస్తూ వ‌చ్చిన ఈ వెబ్ సైట్.. ఈ మ‌ధ్య థియేట‌ర్ల‌లో రిలీజైన సినిమాల హెచ్‌డీ ప్రింట్ల‌ను కూడా అందుబాటులోకి తేవ‌డం మొద‌లుపెట్టింది. 

రిలీజ్ రోజు కొన్ని గంట‌ల్లోనే పైర‌సీ ప్రింట్ల‌ను అందుబాటులోకి తేవ‌డం ద్వారా ఇండ‌స్ట్రీకి క‌ఠిన స‌వాలే విసిరింది ఈ వెబ్ సైట్. అదే స‌మ‌యంలో దీని ఫాలోయింగ్ కూడా మామూలుగా పెర‌గ‌లేదు. దీని అడ్మిన్ ఒక ద‌శ‌లో శ్రుతి మించి.. ఇండ‌స్ట్రీకి పాఠాలు చెప్ప‌డం.. ద‌మ్ముంటే న‌న్ను ప‌ట్టుకోండి అంటూ పోలీసుల‌కు స‌వాలు విస‌ర‌డం చేశాడు. ఇప్పుడు అనుకోకుండా పోలీసుల‌కు దొరికిపోయి జైలు ఊచ‌లు లెక్క‌బెడుతున్నాడు. తన పేరు.. ఇమ్మిడి ర‌వి. క‌రీబియ‌న్ దీవుల్లో ఉంటూ వెబ్ సైట్‌ను న‌డిపిస్తున్న అత‌ను.. హైద‌రాబాద్‌కు వ‌చ్చి పోలీసుల‌కు దొరికిపోయాడు. 

ఐతే ర‌వి పోలీసుల‌కు చిక్కాక కూడా కొన్ని గంట‌ల పాటు ఐబొమ్మ సైట్ న‌డిచింది. దాని అనుబంధ సైట్ బ‌ప్పం టీవీ కూడా కొన‌సాగింది. కానీ ర‌వి నుంచి త‌న వెబ్ సైట్ల‌కు సంబంధించి అన్ని వివ‌రాలు రాబట్టిన పోలీసులు.. ఈ వెబ్ సైట్ల‌ను బ్లాక్ చేయించారు. ఇక ఎప్ప‌టికీ ఈ వెబ్ సైట్లు ర‌న్ కాకుండా పూర్తిగా వాటిని డౌన్ చేయించారు. అడ్మినే అడ్డంగా దొరికిపోవ‌డంతో ఇకపై ఈ సైట్లు ఎప్ప‌టికీ పునఃప్రారంభం అవ‌కాశాలు లేవు. 

ఎన్నో ఏళ్లుగా వీటికి బాగా అల‌వాటు ప‌డిన తెలుగు పైర‌సీ ప్రియులకు ఇక క‌ష్టాలు త‌ప్ప‌వు. వీళ్ల‌లో చాలామంది ఐబొమ్మ డౌన్ అయింద‌ని నిన్న‌ట్నుంచి సోష‌ల్ మీడియాలో ఆవేద‌న, ఆక్రోశం వెళ్ల‌గ‌క్కుతున్నారు. దీని మీద చాలా మీమ్స్ కూడా వ‌స్తున్నాయి. పైర‌సీ మీద తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న నేప‌థ్యంలో ఇక‌పై తెలుగులో ఐబొమ్మ స్థాయిలో పైర‌సీ రాకెట్‌ను న‌డిపే ప్ర‌య‌త్నం ఇంకెవ్వ‌రూ చేయ‌క‌పోవ‌చ్చు.