దేవుడా.. ఈసారి గెలిచేలా చూడు

సూప‌ర్ స్టార్ కృష్ణ అల్లుడు, మ‌హేష్ బాబు బావ అనే గుర్తింపుతో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి.. కొన్నేళ్ల పాటు ఆ గుర్తింపుతోనే బండి న‌డిపించిన సుధీర్ బాబు.. కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ సినిమా నుంచి న‌టుడిగా త‌న‌కంటూ ఒక పేరు సంపాదించుకుని ముందుకు సాగాడు. స‌మ్మోహ‌నం స‌హా కొన్ని చిత్రాలు అత‌డిని న‌టుడిగా కొన్ని మెట్లు ఎక్కించాయి. 

న‌ట‌న ప‌రంగా ఎప్ప‌టిక‌ప్పుడు మెరుగులు దిద్దుకుంటూ సాగ‌డంతో పాటు శారీర‌కంగా సినిమా కోసం అత‌నెంత క‌ష్ట‌ప‌డతాడో అంద‌రికీ తెలుసు. క‌థ‌ల్లో వైవిధ్యం చూపించ‌డానికీ సుధీర్ బాబు ప్ర‌య‌త్నిస్తుంటాడు. కానీ ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా కొన్నేళ్ల నుంచి అత‌డికి ఆశించిన ఫ‌లితం మాత్రం ద‌క్క‌ట్లేదు. హ‌రోంహ‌ర‌, మా నాన్న సూప‌ర్ స్టార్ మంచి సినిమాలే అయినా.. క‌మ‌ర్షియ‌ల్‌గా అనుకున్నంత స‌క్సెస్ కాలేదు. ఇలాంటి టైంలో జ‌టాధ‌ర అనే భారీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు సుధీర్ బాబు.

ప్ర‌స్తుత ట్రెండుకు త‌గ్గ‌ట్లుగా డివైన్ ఎలిమెంట్స్‌తో ముడిప‌డ్డ‌.. హార్ర‌ర్ ట‌చ్ ఉన్న సినిమా ఇది. బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఈ చిత్రంతోనే తెలుగులో అడుగు పెడుతోంది. సోనాక్షి ఫ్యాక్ట‌ర్ వ‌ల్ల ఈ మూవీని హిందీలో కూడా పెద్ద ఎత్తునే రిలీజ్ చేస్తున్నారు. భాగి సినిమాతో సుధీర్‌కు కూడా హిందీలో కొంత పేరొచ్చింది. ఐతే ఈ సినిమా తెలుగులో విజ‌య‌వంతం కావ‌డం సుధీర్‌కు ఎంతో అవ‌స‌రం. ఎంతో క‌ష్ట‌ప‌డి, పెద్ద బ‌డ్జెట్లో చేసిన సినిమా కావ‌డంతో దీనిపై సుధీర్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. అందుకే రిలీజ్ ముంగిట అత‌ను ఒక ఎమోష‌న‌ల్ పోస్టు పెట్టాడు. 

శివుడి ముందు మోక‌రిల్లిన ఒక భ‌క్తుడి క్యారికేచ‌ర్ పెట్టి.. ప్లీజ్ గాడ్ లెట్ మి విన్ దిస్ టైం అంటూ క్యాప్ష‌న్ జోడించాడు. ఈసారైనా గెలిచేలా చూడు అని దేవుడిని వేడుకుంటూ ఇలా పోస్టు పెట్టాడంటే ఈ సినిమా విజ‌యం కోసం అత‌నెంత డెస్ప‌రేట్‌గా ఉన్నాడో అర్థం చేసుకోవ‌చ్చు. సుధీర్ క‌ష్ట‌ప‌డే త‌త్వం చూసి తెలుగు ప్రేక్ష‌కుల్లో అత‌డి ప‌ట్ల సానుకూల భావ‌నే ఉంది. మ‌రి ఈసారి అతను కోరుకున్న విజ‌యాన్ని ఆడియ‌న్స్ అందిస్తారేమో చూడాలి. శుక్ర‌వార‌మే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.