తెలుగు సినిమా సంగీతంలో గత రెండు దశాబ్దాలుగా దేవిశ్రీ ప్రసాద్‌దే ఆధిపత్యం. తమన్ సహా పలువురు సంగీత దర్శకుల నుంచి గట్టి ఎదురైనప్పటికీ తట్టుకుని ఇప్పటికీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు దేవి. టాలీవుడ్లో అందరు అగ్ర హీరోలతోనూ అతను సినిమాలు చేశాడు. ఇప్పుడు కెరీర్లో తొలిసారిగా అతను హీరో అవతారం ఎత్తబోతున్నాడు.
‘బలగం’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కమెడియన్ వేణు దర్శకత్వంలో ‘యల్లమ్మ’ సినిమా చేయబోతున్నాడు. ఈ కథ అటు ఇటు తిరిగి చివరికి దేవి వద్దకు వచ్చింది. ఐతే ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరోవైపు దేవి పెళ్లి గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతున్నా.. ఇంకా అది కార్యరూపం దాల్చలేదు. ఇలాంటి టైంలో జగపతిబాబు నిర్వహించే టాక్ షోకు అతిథిగా వచ్చాడు దేవి. ఆ కార్యక్రమంలో పెళ్లి, హీరో.. ఈ రెంటిలో నీ ఛాయిస్ ఏది అంటూ ఆసక్తికర ప్రశ్న వేశాడు జగపతిబాబు.
దీనికి దేవి స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. హీరో అనే కాదు.. ఇంకే ఆప్షన్ పక్కన పెళ్లి అనే మాట పెట్టినా సరే.. పెళ్లి కాకుండా మరొకటే ఎంచుకుంటానని స్పష్టం చేశాడు దేవి. ముందు హీరో కావడమే తన లక్ష్యమని అతనన్నాడు. హీరో అవుదామని ఎప్పట్నుంచో కథలు వింటున్నట్లు చెప్పిన దేవి.. ‘యల్లమ్మ’ సినిమా చేయబోతున్న విషయాన్ని మాత్రం ధ్రువీకరించలేదు. మరోవైపు తన జీవితంలో మరపురాని అనుభవం గురించి చెబుతూ.. ఇళయరాజాను జీవితంలో ఒక్కసారైనా కలవాలని తాను కలలు కన్నానని, అలాంటిది గత ఏడాది ఆయనే తన స్టూడియోకు రావడం గొప్ప అనుభూతి అని దేవి చెప్పాడు.
తన పాటకు చిరంజీవిలా ఇంకెవరూ న్యాయం చేయలేరని.. సంగీత దర్శకత్వంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి తన పాటకు ఆయన డ్యాన్స్ చేయాలి అని తపించానని.. శంకర్ దాదా సినిమాతో అది సాధ్యమైందని.. ఇప్పుడు కూడా చిరు తన పాటకు డ్యాన్స్ చేస్తే అలా చూస్తూ ఉండిపోతానని అతనన్నాడు. తన పాటల్లో ‘ఖడ్గం’ సినిమాలోని ‘నువ్వు నువ్వు’ చాలా స్పెషలన్న దేవి.. ‘ఆర్య’లోని ‘అ అంటే అమలాపురం’ పాటకు చాలా కష్టపడ్డట్లు వెల్లడించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates