తన పేరుపై రెస్టారెంట్.. చిరు ఏం చేశారో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి పేరును కొందరు స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారన్న సమాచారంతో ఆయన కోర్టుకు వెళ్లి మరీ ఇందుకు వ్యతిరేకంగా ఆదేశాలు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చిరు పేరును బిజినెస్, ఇతర అవసరాల కోసం ఉపయోగిస్తున్న అనేక మందికి ఆయన టీం నుంచి నోటీసులు కూడా వెళ్లాయి. ఇందులో స్ట్రీట్ బైట్ రవి కూడా ఒకరు. ఆయన హైదరాబాద్‌లోని నల్లగండ్లలో ‘చిరంజీవి’ అనే పేరు పెట్టే రెస్టారెంట్ నడిపిస్తున్నారు. ఆ రెస్టారెంట్లోకి అడుగు పెడితే ఎటు చూసినా చిరంజీవి ఫొటోలు, క్యారికేచర్లు, ఆయనకు సంబంధించిన క్యాప్షన్లే కనిపిస్తాయి.

అది మెగా అభిమానులకు చాలా నోస్టాల్జిగ్గా అనిపించే ప్లేస్ కూడా. ఐతే చిరు మీద అభిమానంతో ఆయన పేరు మీద రెస్టారెంట్ పెట్టి నడిపిస్తుంటే.. ఆయన టీం నుంచి నోటీసులు వచ్చేసరికి స్ట్రీట్ బైట్ రవి అండ్ కో ఆందోళన చెందారు.

ఐతే రవి బృందం.. చిరు టీంను సంప్రదించడం.. వాళ్లు వచ్చి రెస్టారెంట్‌ను పరిశీలించి.. యధావిధిగా దాన్ని నడుపుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందట. చిరుకు కూడా ఈ మేరకు సమాచారం వెళ్లగా.. ఆయన ఈ రెస్టారెంట్ విషయంలో ఎలాంటి అభ్యంతరం తెలపలేదట. ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా స్ట్రీట్ బైట్ రవి వెల్లడించారు. తాము చిరు మీద వీరాభిమానంతోనే ఈ రెస్టారెంట్ పెట్టామని.. ఆయన పేరును ఏ రకంగానూ దుర్వినియోగం చేయట్లేదని.. అంతేకాక చిరుకు ఎంతమాత్రం చెడ్డ పేరు రానివ్వకుండా మంచి క్వాలిటీతో ఫుడ్ అందిస్తున్నామని ఆయన వివరించారు.

అందరికీ నోటీసులివ్వడంలో భాగంగానే తమకూ ఇచ్చారని.. కానీ రెస్టారెంట్‌ను పరిశీలించిన చిరు టీంకు ఇందులో అభిమానం తప్ప, వేరే ఉద్దేశాలు కనిపించలేదని రవి తెలిపారు. చిరుకు ఈమేరకు సమాచారం ఇచ్చాక ఆయన రెస్టారెంట్‌ కొనసాగించడానికి అనుమతి ఇచ్చారన్నారు. ఆయనిది చిన్న విషయమే కానీ.. అభిమానుల ఇలా ఆలోచించడం తమకు పెద్ద విషయమన్నారు. చిరు పేరును దుర్వినియోగం చేస్తున్న వాళ్లకు మాత్రమే నోటీసులు ఇస్తున్నారు తప్ప.. నిజంగా అభిమానంతో చేసే ఫ్యాన్స్‌ విషయంలో చిరుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని.. ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకోవద్దని రవి విన్నవించారు.