వసూళ్ల వర్షంలో మాహిష్మతి సామ్రాజ్యం

బాహుబలి ది ఎపిక్ అంచనాలకు మించి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. గురువారం వేసిన ప్రీమియర్లతో కలిపి మొదటి రోజు సుమారు పది కోట్ల నలభై లక్షల దాకా నెట్ వచ్చిందని ట్రేడ్ సమాచారం. అది కూడా కేవలం ఇండియా వైడ్ నెంబర్లే కావడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. పోటీగా నిలుస్తుందనుకున్న మాస్ జాతరకు భిన్నమైన టాక్ రావడం బాహుబలికి కలిసి వచ్చేలా ఉంది. ముఖ్యంగా ఏ సెంటర్స్ లో రాంపేజ్ మాములుగా లేదు. ముందుగా షెడ్యూల్ చేసిన షోలన్నీ హౌస్ ఫుల్ కావడంతో అదనపు స్క్రీన్లు జోడించే పనిలో ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఆ స్థాయిలో డిమాండ్ నెలకొంది.

వీకెండ్ వరకు బాహుబలి ఎపిక్ కి ఎలాంటి ఢోకా లేదు. థియేటర్లలో నాలుగు గంటల సమయాన్ని వెచ్చించాల్సి వచ్చినా ఆడియన్స్ లెక్క చేయడం లేదు. రెండు భాగాలను ఒకే పార్ట్ గా ఎలా చేసి ఉంటారనే ఆసక్తి టికెట్లు కొనేలా చేస్తోంది. ఫ్యాన్స్ ఫైనల్ రన్ అయ్యేలోపు వంద కోట్లను ఆశిస్తున్నారు కానీ అంత సులభంగా జరిగే పనైతే కాదు. ఎందుకంటే సోమవారం నుంచి ఎంత డ్రాప్ ఉంటుందనేది కీలకం కానుంది. ఒకవేళ ఇదే జోరు కొనసాగించి కనీసం యాభై శాతం ఆక్యుపెన్సీలు నమోదు చేయగలిగితే సెన్సేషన్ అవుతుంది. రెండో విడత ప్రమోషన్లకు ఆర్కా మీడియా రెడీ అవుతున్నట్టు సమాచారం.

పదేళ్ల క్రితం రాజమౌళి ఆవిష్కరించిన ఈ విజువల్ వండర్ తాలూకు ఎమోషన్ జనంలో ఎంత బలంగా ఉందో ఇంత కన్నా సాక్ష్యం అక్కర్లేదు. అయితే తెలుగులో ఎంత సునామి చేస్తున్నా ఇతర భాషల్లో మాత్రం బాహుబలి ఎపిక్ కు భారీ స్పందన లేదు. ఉత్తరాదిలోనూ నెమ్మదిగానే ఉంది. టాలీవుడ్ ఆడియన్స్ స్వంతం చేసుకున్నంతగా బాహుబలిని ఇంకెవరు ప్రేమించలేదన్నది వాస్తవం. పిల్లా పెద్ద కలిసి ఏదో కొత్త రిలీజ్ అన్న రేంజ్ లో ఎపిక్ చూసేందుకు వెళ్లడం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. థియేటర్ రన్ అయ్యాక బాహుబలి ది ఎపిక్ ఓటిటి వెర్షన్ ని రిలీజ్ చేస్తారా లేదానే ఎగ్జైట్ మెంట్ ఫ్యాన్స్ లో మొదలైపోయింది.