బాహుబ‌లి ఎఫ‌క్ట్… పుష్ప‌పై డిస్క‌ష‌న్‌

బాహుబ‌లి సినిమాతో ఇండియ‌న్ సినిమాకు ఒక టార్చ్ బేర‌ర్‌గా మారాడు రాజ‌మౌళి. ఎంత భారీ క‌ల‌నైనా క‌ని.. దానికి స‌రైన రూపం ఇస్తే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అసాధార‌ణ ఫ‌లితాలు రాబ‌ట్ట‌వ‌చ్చని ఆ సినిమాతో రుజువు చేశాడు జ‌క్క‌న్న‌. బాక్సాపీస్ ద‌గ్గ‌ర ఆ సినిమా సాధించిన ఘ‌న‌త‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇప్పుడు మ‌రోసారి బాహుబ‌లి టీం ట్రెండ్ సెట్ చేస్తోంది. బాహుబ‌లి: ది బిగినింగ్, ది కంక్లూజ‌న్ చిత్రాలు రెంటినీ క‌లిపి ది ఎపిక్ పేరుతో ఒక సినిమాగా ఎడిట్ చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది. 

ఈ సినిమాకు మంచి స్పంద‌నే ఉంటుంద‌నుకున్నారు కానీ.. అంచ‌నాల‌ను మించిన రెస్పాన్సే వ‌స్తోంది. కొత్త సినిమాల‌ను కూడా వెన‌క్కి నెట్టి భారీ వ‌సూళ్ల దిశ‌గా దూసుకెళ్తోంది బాహుబ‌లి: ది ఎపిక్. ప‌దేళ్ల త‌ర్వాత కూడా బాహుబ‌లి ఇలాంటి అద్భుతం చేయ‌డం అనూహ్యం. ఈ ఊపు చూశాక ఇలాంటి ప్ర‌యోగం వేరే చిత్రాలు ఎందుకు చేయ‌కూడ‌ద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా పుష్ప సినిమా గురించి కూడా మాట్లాడుకుంటున్నారు.

పుష్పను మొద‌లుపెట్టిన‌పుడు దాన్ని ఒక సినిమాగానే తీయాల‌నుకున్నారు. కానీ త‌ర్వాత ఆలోచ‌న మారింది. బాహుబ‌లిని అనుస‌రిస్తూ ఒక క‌థ‌ను రెండు భాగాలు చేశాడు సుకుమార్.. ఇప్పుడు బాహుబ‌లి రెండు భాగాలను క‌లిపి ఒక చిత్రంగా అందించాల‌న్న ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం కావ‌డంతో పుష్ప టీం కూడా ఇదే బాట‌లో న‌డిస్తే ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తి మొద‌లైంది. బాహుబ‌లి త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా అంత‌టి యుఫోరియా క్రియేట్ చేసిన మూవీ పుష్ప‌. నార్త్ ఇండియా ప్రేక్ష‌కులు ఈ సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. 

పుష్ప రెండు భాగాల‌ను క‌లిపి ఒక సినిమాగా అందిస్తే అక్క‌డి ప్రేక్ష‌కులు బాగానే ఆద‌రించే అవ‌కాశ‌ముంది. తెలుగు ప్రేక్ష‌కులు ఎలాగూ ఈ సినిమాను బాగానే చూస్తార‌న‌డంలో సందేహం లేదు. కాక‌పోతే ఇప్పుడే ఆ ప‌ని చేయాల్సిన అవ‌స‌రం లేదు. కొన్నేళ్లు గ‌డిచాక ఈ ప్ర‌య‌త్నం చేస్తే మంచి ఫ‌లితం ద‌క్కే అవ‌కాశ‌ముంది. మ‌రి సుకుమార్ అండ్ టీం భవిష్య‌త్తులో బాహుబ‌లి బాట ప‌డుతుందేమో చూడాలి.