రాజమౌళి.. మహేష్ కొడుకుని కూడా భయపెట్టేశాడు

ఈ రోజుల్లో కొత్త సినిమాల నుంచి అప్‌డేట్స్, లీక్స్ రాకుండా ఆపడం అంటే చాలా కష్టమైన విషయం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కంటెంట్ బయటికి వచ్చేస్తుంటుంది. ఐతే మిగతా చిత్రాలతో పోలిస్తే రాజమౌళి సినిమాలకు పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతాయి. అధికారికంగా ప్రకటించే వరకు సినిమా విశేషాలేవీ బయటికి పొక్కకుండా టీంలో అందరికీ స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అయినా సరే కొన్నిసార్లు అనుకోకుండా లీక్స్ జరుగుతుంటాయి. 

మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమా లొకేషన్ నుంచి కొన్ని నెలల ముందు చిన్న వీడియో ఒకటి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే టీంలోని ఎవ్వరి నుంచి సినిమా గురించి ఒక చిన్న విషయం కూడా బయటికి రాలేదు. స్వయంగా రాజమౌళే.. మహేష్ చిత్రం గురించి ఎవ్వరు అడిగినా  మాట దాట వేసేస్తున్నాడు. ఇక మిగతా ఎవ్వరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఐతే హీరో మహేష్ బాబు తనయుడు గౌతమ్ నుంచి ఏవైనా కొన్ని విశేషాలు బయట పెట్టిద్దామని ఒక మీడియా సంస్థ ప్రయత్నిస్తే.. అతను దండం పెట్టి వెళ్లిపోయాడు.

మహేష్ తనయుడు గౌతమ్.. ప్రస్తుతం యుఎస్‌లో ఉన్నాడు. అక్కడే చదువుకుంటూ సినిమాల కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ‘బాహుబలి: ది ఎపిక్’ రీ రిలీజ్ నేపథ్యంలో గౌతమ్ వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్లలో ఒకటైన థియేటర్‌లో షో చూడ్డానికి వెళ్లాడు. ఆ సందర్భంగా అతణ్ని ఒక మీడియా సంస్థ ప్రతినిధి ఇంటర్వ్యూ చేశాడు. ఇలాంటి స్క్రీన్లో బాహుబలి సినిమా చూడబోతుండడం గురించి అతను చాలా ఎగ్జైట్ అయ్యాడు. తనకు గూస్ బంప్స్ వస్తున్నాయన్నాడు. తెలుగు వాళ్లందరికీ ఇది చాలా స్పెషల్ అన్నాడు. 

అంతా అయ్యాక మహేష్ బాబు సినిమా గురించి ప్రశ్నిస్తే.. దాని గురించి మాత్రం అడక్కండి, నేనేమీ మాట్లాడను అంటూ అతను అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఇది చూస్తే.. సినిమా విశేషాలేమీ బయటికి పొక్కకుండా తన టీం మెంబర్స్‌నే కాక వాళ్ల కుటుంబ సభ్యులను సైతం రాజమౌళి భయపెట్టేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.