మాస్ జాతర విడుదల నెలల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఊహించని విధంగా బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురు కావడం ఇబ్బందికర పరిణామమే అయినా ఇప్పుడు వెనుకడుగు వేసే పరిస్థితి లేకపోవడంతో నిర్మాత నాగవంశీ ప్రొసీడ్ అవుతున్నారు. అయితే మొదట చెప్పిన డేట్ అక్టోబర్ 31 రెగ్యులర్ షోలు వేయకుండా కేవలం సాయంత్రం నుంచి స్పెషల్ ప్రీమియర్లతో ఆటలు మొదలుపెట్టడం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. అంటే ఆన్ రికార్డ్ మాస్ జాతర రెగ్యులర్ విడుదల తేదీ నవంబర్ 1 అవుతుంది. సరే వినడానికి బాగానే ఉంది, కానీ ఇప్పుడీ ప్రీమియర్ల మీద చాలా పెద్ద బరువే ఉంది.
గత కొన్నేళ్లుగా రవితేజ సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేసిన దాఖలాలు చాలా తక్కువ. గత ఏడాది మిస్టర్ బచ్చన్ కు ఆ రిస్క్ తీసుకున్నారు కానీ ఆ నిర్ణయమే నిలువునా ముంచేసిందని అభిమానులు వాపోయారు. కంటెంట్ తేడా ఉండటం పక్కనపెడితే రాత్రికి రాత్రి బ్యాడ్ టాక్ స్ప్రెడ్ కావడం వాళ్ళను నిరాశ పరిచింది. దీనికి ముందు ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర తదితర సినిమాలకు దేనికీ ముందు రోజు షోలు వేయలేదు. వాల్తేరు వీరయ్య కూడా తెల్లవారుఝాము నుంచి మొదలుపెట్టారు. సో మాస్ జాతర ఈ రకంగా చూసుకుంటే పెద్ద అడ్వెంచర్ చేస్తోంది. ప్రొడ్యూసర్ కున్న కాన్ఫిడెన్స్ ఇది.
బుక్ మై షోలో మాస్ జాతర హైదరాబాద్ బుకింగ్స్ మొదలుపెట్టారు. ఇంకా ట్రెండింగ్ లోకి రాలేదు. పూర్తిగా సోల్డ్ అవుట్ అయిన షో గంటల తర్వాత కూడా లేదు. స్లోగా ఆరంజ్ కలర్ లోకి మారుతోంది. ట్రైలర్ కు ఎక్స్ ట్రాడినరి రెస్పాన్స్ రాకపోవడం ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. టీమ్ లెక్క వేరుగా ఉంది. పైకి రొటీన్ కథలా కనిపించినా థియేటర్ లో ఊహించని చాలా ఎలిమెంట్స్ సర్ప్రైజ్ చేస్తాయని, వాటిని రివీల్ చేయకుండా తీసుకున్న జాగ్రత్తల వల్ల కొంచెం హైప్ తగ్గినట్టు అనిపించినా 31 అర్ధరాత్రి సమయానికి టాక్ లెక్కలు మారిపోతాయని ధీమాగా ఉంది. చూడాలి మరి ఇంత బరువుని ఎలా మోస్తుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates