బాహుబలి ఎపిక్ వల్ల ఇద్దరికి ఇబ్బంది

ఒక రీ రిలీజ్ సినిమాకు ఏదో కొత్త మూవీ రేంజ్ లో హడావిడి నెలకొనడం అరుదు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఒకట్రెండు సందర్భాల్లో ఆ మేనియా చూపించారు కానీ బాహుబలి ది ఎపిక్ మాత్రం ఎవరికీ అందనంత ఎత్తులో హైప్ పెంచుకుంటూ పోతోంది. అక్టోబర్ 31 సంబంధించి బుక్ మై షో ఓపెన్ చేస్తే హైదరాబాద్ మెయిన్ స్క్రీన్ల టికెట్లన్నీ దాదాపు సోల్డ్ అవుట్ అయిపోయాయి. సుదర్శన్, భ్రమరాంబ లాంటి వాటిలో కనీసం ఒక్క పేపర్ ముక్క దొరికే పరిస్థితి కనిపించడం లేదు. 3 గంటల 44 నిమిషాల బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ కూడా ఎగబడుతున్న వైనం స్పష్టం.

దీని ప్రభావం కొత్త రిలీజుల మీద పడుతోంది. రవితేజ మాస్ జాతరని ఒక రోజు ఆలస్యంగా తెచ్చే ఆలోచనని నిర్మాత నాగవంశీ సీరియస్ గా చేస్తున్నారు. దాదాపు ఫిక్స్ అయినట్టే. అంటే నవంబర్ ఒకటిన ఫుల్ లెన్త్ షోలు వేసేలా డిస్ట్రిబ్యూటర్లకు చెప్పేశారని ట్రేడ్ టాక్. కంటెంట్ మీద ఎంత ధీమాగా ఉన్నా బాహుబలి ఎపిక్ ఫీవర్ ముందు తట్టుకుని నిలవడం అంత సులభంగా అయితే లేదు. అసలే రవితేజ ట్రాక్ రికార్డు అంతంతమాత్రంగా ఉంది. ఇప్పుడు మాస్ జాతర రూపంలో బలంగా బౌన్స్ బ్యాక్ అవుతారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో బాహుబలి రూపంలో స్పీడ్ బ్రేకర్ తగిలింది.

ఇంకో వైపు తమిళ హీరో విష్ణు విశాల్ సైతం బాహుబలి ఎపిక్ వల్లే స్ట్రగుల్ అవుతున్నాడు. తన కొత్త సైకో థ్రిల్లర్ ఆర్యన్ మీద బోలెడు నమ్మకంతో ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసుకుంటున్నాడు. రాక్షసుడు ఒరిజినల్ వెర్షన్ డబ్బింగ్ చేయకుండా రీమేక్ రైట్స్ ఇవ్వడంతో తాను ఏం మిస్ చేసుకున్నాడో అర్థం చేసుకున్న విష్ణు విశాల్ ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తమిళ తెలుగులో సమాంతరంగా ఆర్యన్ ని అక్టోబర్ 31 విడుదల చేస్తున్నాడు. బాహుబలి ఎఫెక్ట్ తన మీద కూడా బలంగా పడుతోంది. యునానిమస్ టాక్ వస్తేనే తట్టుకుని నిలవడం సాధ్యమవుతుంది. చూడాలి మరి ట్రయాంగిల్ వార్ ఎలా ఉండబోతోందో.