తెలుగు, తమిళ ఫ్యాన్స్ కొత్త గొడవ

సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేయడానికి పెద్ద కారణాలేమీ అక్కర్లేదు. చాలా చిన్న చిన్న విషయాలను పట్టుకుని.. కారణాలు వెతుక్కుని గొడవ పడుతుంటారు స్టార్ హీరోల ఫ్యాన్స్. కొన్నిసార్లు ఈ గొడవలు బోర్డర్లను దాటిపోయి రెండు భాషల ప్రేక్షకుల మధ్య కూడా ఘర్షణగా మారుతుంటాయి. ఈ మధ్యే కన్నడ స్టార్ దర్శన్ అభిమానులకు.. మన తెలుగు హీరో అభిమానులకు మధ్య పెద్ద ఎత్తునే సోషల్ మీడియా వార్ జరిగింది.

ఇప్పుడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.. తమిళ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ అభిమానుల మధ్య కొన్ని రోజులుగా గొడవ జరుగుతోంది. కొన్నేళ్లుగా సరైన విజయాలు లేని అజిత్, పవన్.. ఈ ఏడాది తమ కొత్త చిత్రాలతో విజయాలందుకున్నారు. ఫిబ్రవరిలో అజిత్‌కు ’గుడ్ బ్యాడ్ అగ్లీ’ పెద్ద సక్సెస్ అందించగా.. పవన్ ఇటీవలే ‘ఓజీ’తో ఉపశమనం పొందారు. ఐతే ఈ సినిమాల్లో ఏది బెస్ట్ అనే విషయంలో ఇరువురు హీరోల అభిమానులు కొట్టేసుకుంటున్నారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ, ఓజీ సినిమాల్లో కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఇవి హీరోల ఎలివేషన్ల మీదే నడిచిన సినిమాలు. అభిమానులను దృష్టిలో ఉంచుకుని సన్నివేశాలను రూపొందించారు. సినిమా అంతా ఎడతెగని విధంగా ఎలివేషన్ సీన్లు ఉంటాయి. కథ రెండింట్లోనూ వీకే. ఇద్దరు హీరోలననూ వారి అభిమానులైన దర్శకులే డైరెక్ట్ చేశారు.

తమ ఫేవరెట్ హీరోలను ది బెస్ట్‌గా చూపించే ప్రయత్నం చేశారు. ఐతే ఆ హీరోల ఫ్యాన్స్ వారి సినిమాలను వాళ్లు ఆస్వాదించి ఊరుకుంటే సరిపోయేది. కానీ చిత్రంగా.. గుడ్ బ్యాడ్ అగ్లీ, ఓజీల్లో ఏది బెస్ట్ అనే డిస్కషన్లోకి దిగారు. ఆ క్రమంలో అవతలి సినిమాను కించపరుస్తున్నారు. ఓజీ ఓటీటీ వెర్షన్ వచ్చినప్పటి నుంచి ఈ గొడవ మొదలైంది. అది రోజు రోజుకూ తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఈ ఇద్దరు హీరోలు సింపుల్‌గా తమ పని తాము చేసుకుపోయే రకం. బిల్డప్పులివ్వరు. అతిచేయరు. మరి వాళ్ల అభిమానులు మాత్రం సిల్లీ కారణాలతో ఇలా గొడవ పడడమే విడ్డూరం.