దేవి వచ్చాడు.. మరి కీర్తికి ఓకేనా?

టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి చర్చల్లో ఉండి, ఎంతకూ సెట్స్ మీదకు వెళ్లని సినిమా.. యల్లమ్మ. ‘బలగం’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కమెడియన్ టర్న్డ్ డైరెక్టర్ వేణు యల్దండి.. తన రెండో చిత్రంగా దీన్ని రూపొందించాలనకున్నాడు. నిర్మాత దిల్ రాజు మరోసారి వేణు మీద నమ్మకం పెట్టాడు. కానీ ముందు నానితో అనుకున్న సినిమా.. తర్వాత నితిన్ దగ్గరికి వచ్చింది. ఏవో కారణాలతో అతను కూడా తప్పుకుంటే.. చివరికి ఎవ్వరూ ఊహించని విధంగా దేవిశ్రీ ప్రసాద్ లీడ్ రోల్ లో ఈ సినిమా తెరకెక్కనుంది.

చాలా ఏళ్ల కిందట దేవిని తనే దర్శకుడిగా పరిచయం చేస్తా అన్న దిల్ రాజు ఇలా మాట నిలబెట్టుకుంటున్నాడు. కానీ సుకుమార్‌ డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ చేస్తా అన్నాడు కానీ.. వేణుకు ఆ ఛాన్స్ దక్కింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఐతే ఈ చిత్రంలో దేవికి జోడీగా ఎవరు కథానాయికగా నటిస్తారన్నది ఆసక్తికరం. నితిన్‌తో సినిమా అనుకున్నపుడు కీర్తి సురేష్‌ దాదాపుగా ఓకే అయిపోయింది.

‘రంగ్ దే’ తర్వాత మరోసారి నితిన్‌తో జట్టు కట్టడానికి కీర్తి ఓకే చెప్పింది. ఐతే ‘యల్లమ్మ’ సంగతి తేలకముందే దిల్ రాజు ప్రొడక్షన్లో కీర్తి.. విజయ్ దేవరకొండ సినిమాకు కథానాయికగా ఎంపికైంది. ఇప్పుడు ‘యల్లమ్మ’లో దేవి హీరోగా నటించబోతున్నాడు. రాజు సంస్థలో ఆమె వరుసగా రెండో సినిమా చేస్తుందా.. దేవితో జట్టు కట్టడానికి ఆమెకు ఓకేనా అన్నది చూడాలి.

ఐతే కీర్తి స్టార్ల సరసనే నటించాలి అనే రూల్స్ ఏమీ పెట్టుకోదు. చిన్న హీరోలతోనూ కలిసి పని చేస్తుంది. హీరోయిన్ కాదు కానీ.. సుహాస్‌తో కూడా కలిసి ‘ఉప్పు కప్పురంబు’ సినిమా చేసింది. కాబట్టి దేవితో సినిమా చేయడానికి కీర్తికి ఇబ్బంది లేకపోవచ్చు. కాకపోతే తనకు పాత్ర నచ్చాలి. మరి వేణు ఆమెను ఇంప్రెస్ చేసి ఈ సినిమాలో నటింపజేస్తే.. సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు.