ఈ నెల ఆరంభంలో దసరా కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైంది కాంతార: చాప్టర్-1. అయితే మేకింగ్ దశలో ఉన్న హైప్ రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి తగ్గడం.. తొలి రోజు కొంత మిక్స్డ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడగలదా లేదా అన్న సందేహాలు కలిగాయి. కానీ రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం.. అంచనాలను మించే వసూళ్లు రాబడుతూ సాగింది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని గొప్పగా ఆదరించారు.
కన్నడలో అన్ని బాక్సాఫీస్ రికార్డులనూ ఈ చిత్రం బద్దలు కొట్టేసింది. కాంతార పేరిటే ఉన్న ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ ఇన్ కర్ణాటక రికార్డును దాటేసింది. తెలుగు, హిందీలోనూ కాంతార: చాప్టర్-1కు మంచి వసూళ్లు వచ్చాయి. ఏదో వారం పది రోజులు వసూళ్లు రాబట్టి ఆ తర్వాత డౌన్ అయిపోవడం కాకుండా మూడో వారంలోనూ కాంతార ప్రీక్వెల్ బాక్సాషీస్ దగ్గర ప్రభావం చూపిస్తోంది. దీపావళి సినిమాల పోటీని తట్టుకుని మరీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.
తాజాగా కాంతార: చాప్టర్ 1 వసూళ్లు రూ.700 కోట్ల మార్కును కూడా దాటేశాయి. మేకర్స్ ప్రకటించిన ప్రకారం ఇప్పటిదాకా ఈ సినిమా వసూళ్లు రూ.717 కోట్లు. నిర్మాణ సంస్థలు కలెక్షన్లను కొంచెం ఎగ్జాజరేట్ చూపించడం సహజం. కాబట్టి ఒరిజినల్ కలెక్షన్లు రూ.700 కోట్లకు చేరువగా ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలా చూసినా ఈ సినిమాకు ఈ వసూళ్లు గొప్పే. ఇక ఈ ఏడాది ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ రికార్డును కాంతార సొంతం చేసుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ రికార్డు బాలీవుడ్ మూవీ ఛావా పేరిట ఉంది. ఈ ఏడాది ఆరంభంలో రిలీజైన ఆ సినిమా దాదాపు రూ.800 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. సైయారా రూ.600 కోట్లతో రెండో స్థానం సాధించగా.. దాన్ని కాంతార: చాప్టర్-1 ఆల్రెడీ దాటేసింది. దీపావళి సినిమాల పోటీని తట్టుకుని ఈ వీకెండ్లో కాంతార ఎంత కలెక్ట్ చేస్తుందన్నదాన్ని బట్టి దీని ఫైనల్ వసూళ్ల మీద అంచనా రావచ్చు. వచ్చే రెండున్నర నెలల్లో రికార్డు కొట్టే స్థాయి భారీ చిత్రాలు ఏవీ లేవు కాబట్టి కాంతార ప్రీక్వెల్‌కే ఛావాను అధిగమించే అవకాశాలున్నాయి. మరి రికార్డు సాధ్యమవుతుందో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates