తమిళ సూపర్ స్టార్లలో ఒకడైన విజయ్ నటించిన కొత్త సినిమా మాస్టర్. ఖైదీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మాళవిక మోహనన్ కథానాయికగా, విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. వేసవిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఐతే గత కొన్ని నెలల నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందని మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారాలు జరగడం.. దాన్ని నిర్మాతలు ఖండించడం పరిపాటిగా మారింది. కానీ ఎంతకీ ఈ ప్రచారాలు ఆగలేదు. దీంతో నిర్మాతలు ఒక ప్రెస్ నోట్ ద్వారా మాస్టర్ రిలీజ్ గురించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇన్ని రోజులూ తమ చిత్రం ఓటీటీలోకి రాదని మాత్రమే చెబుతూ వచ్చిన మాస్టర్ నిర్మాతలు.. ఇప్పుడు ఓటీటీలతో చర్చలు జరిగిన మాట వాస్తవమే అని పరోక్షంగా చెప్పారు. ఒక పెద్ద ఓటీటీ సంస్థ తమ చిత్రానికి పెద్ద ఆఫర్ ఇచ్చిందని.. కానీ దాన్ని తాము అంగీకరించలేదని మాస్టర్ నిర్మాతలు స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీని రక్షించడానికి మాస్టర్ లాంటి భారీ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడమే కరెక్ట్ అని.. ఇలాంటి సినిమాను థియేటర్లలో చూస్తేనే పూర్తి స్థాయిలో ఆస్వాదించగలమని వారు పేర్కొన్నారు. కాబట్టి థియేటర్లు పూర్తి స్థాయిలో ఎప్పుడు నడుస్తాయో అప్పుడు తమ చిత్రాన్ని అక్కడే రిలీజ్ చేస్తామని, అభిమానులు అంతవరకు ఓపిగ్గా ఎదురు చూడాలని నిర్మాతలు స్పష్టం చేశారు. సంక్రాంతికి వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిస్తే అప్పుడు, లేదంటే వేసవికి మాస్టర్ విడుదలయ్యే అవకాశముంది.