మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ.. సోషల్ మీడియాలో తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్శల్ పర్సన్‌గా ముద్ర వేసుకున్నాడు శ్రీకాంత్ అయ్యంగార్ అలియాస్ శ్రీకాంత్ భరత్. ఇటీవల అతను మహాత్మా గాంధీ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. గాంధీని వాడు వీడు అని సంబోధిస్తూ ఆయన మనకు స్వాతంత్య్రం తేవడమేంటి.. సుభాష్ చంద్రబోస్ తెచ్చాడు అంటూ వ్యాఖ్యానించాడు శ్రీకాంత్. అంతటితో ఆగకుండా గాంధీని పీడోఫైల్ అంటూ తీవ్రమైన కామెంట్ చేశాడు.
ఇది గాంధీ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. శ్రీకాంత్ మీద పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసే వరకు వ్యవహారం వెళ్లింది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసెడెంట్ మంచు విష్ణును కూడా కలిసి శ్రీకాంత్ మీద ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ స్పందించాలని.. కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవహారం కాస్త ముదిరేసరికి శ్రీకాంత్ క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు.
ఐతే ఈ వీడియోలో శ్రీకాంత్ ఎక్కడా గాంధీ పేరెత్తలేదు. తాను చేసిన ఫలానా వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నా అనలేదు. తన వల్ల ఈ మధ్య చాలామంది హర్టయ్యారని తెలిసిందని.. వాళ్లందరికీ బేషరతుగా క్షమాపణ చెబుతున్నానని, తనను అందరూ క్షమించాలని శ్రీకాంత్ కోరాడు. తన వ్యాఖ్యల ఉద్దేశం వేరని, తనను తప్పుగా అర్థం చేసుకున్నారని అతను వ్యాఖ్యానించాడు. అదే సమయంలో మరోసారి గాంధీ మీద పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు శ్రీకాంత్.
మన దేశానికి స్వాతంత్య్రం తెచ్చి పెట్టడం కోసం ఎందరో పోరాడారని.. ప్రాణాలను త్యాగం చేశారని.. కానీ ఒక్క వ్యక్తికే మొత్తం క్రెడిట్ కట్టబెట్టడం కరెక్ట్ కాదని శ్రీకాంత్ అన్నాడు. అందరుస్వాతంత్య్ర సమరయోధులనూ గుర్తుంచుకోకపోవడం కంటే వారిని విస్మరించడం నేరమని.. కాబట్టి అందరికీ క్రెడిట్ దక్కాలన్నట్లుగా శ్రీకాంత్ మాట్లాడాడు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన అందరికీ తాను క్షమాపణలు చెబుతున్నట్లు శ్రీకాంత్ పేర్కొన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates