ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన అమ్మాయి కృతి శెట్టి. తన రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్ సైతం హిట్టయింది. మూడో చిత్రం బంగార్రాజు పర్వాలేదనిపించింది. కానీ ఆ తర్వాత మాత్రం కృతికి షాక్‌ల మీద షాక్‌లు తగిలాయి. మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే.. ఇలా తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో టాలీవుడ్లో కెరీర్ బాగా డల్ అయిపోయింది. దాదాపుగా ఇక్కడ అవకాశాలు ఆగిపోయాయి.
కానీ కోలీవుడ్లో మాత్రం కృతికి మంచి అవకాశాలే వచ్చాయి. మూడేళ్ల కిందటే ఆమె మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకుంది. కానీ దురదృష్టం ఏంటంటే.. ఆ మూడు సినిమాలూ ఆలస్యం అయ్యాయి. తన కోలీవుడ్ డెబ్యూ బాగా లేటైపోయింది. ఆ మూడు చిత్రాల్లో ఒక్కటి ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు. కానీ విశేషం ఏంటంటే.. మూడేళ్ల ముందు మొదలైన మూడు చిత్రాలు.. ఇప్పుడు ఒకే నెలలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ చిత్రాలు కృతి తమిళ కెరీర్‌ను నిర్దేశించబోతున్నాయి.
కోలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన కార్తితో కృతి నటిస్తున్న చిత్రం.. వా వాతియార్. సూదు కవ్వుం చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నలన్ కుమార స్వామి ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా గత ఏడాదే విడుదల కావాల్సింది. కానీ ఆలస్యం అయింది. అయినప్పటికీ ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది. ఈ మూవీ డిసెంబరులో విడుదల కానుంది.
మరోవైపు యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్‌తో కృతి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే చిత్రంలో నటించింది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ రూపొందించాడీ సినిమాను. దీనికి పునాది పడింది మూడేళ్ల ముందు అయినా.. సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరిగింది. షూట్ కూడా లేటైంది. ఈ మూవీ కూడా డిసెంబరులోనే రానుంది.
ఇంకోవైపు జయం రవి సరసన కృతి జీనీ అనే సినిమాలో నటించింది. ఇందులో మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ మరో కథానాయిక. ఇటీవలే ఈ ముగ్గురి మీద తీసిన ఒక సాంగ్ రిలీజ్ చేస్తే అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మూవీ కూడా డిసెంబరులోనే రిలీజ్ కానుండడం విశేషం. మొత్తానికి డిసెంబరు నెలలో కృతి శెట్టి కెరీర్ అటా ఇటా అన్నది తేలిపోతుందన్నమాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates