సాధారణంగా కథ రాసిన రచయిత లేదా సినిమా తీసిన దర్శకుడు టైటిల్ కూడా పెడుతుంటారు. కొన్నిసార్లు మాత్రం హీరోనో, నిర్మాతో పేరు సూచిస్తుంటారు. అది అందరికీ ఆమోదయోగ్యం అయితే కన్ఫమ్ అవుతుంది. తన కొత్త చిత్రం ‘మాస్ జాతర’కు స్వయంగా హీరో రవితేజే టైటిల్ పెట్టాడట. ఈ విషయాన్ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న భాను భోగవరపు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
రవితేజకు తొలిసారి ఈ కథ చెప్పినపుడు ఇందులో మాస్ అంశాలు బాగా నచ్చి, తనకు బాగా సూటయ్యే సినిమా అని భావించిన రవితేజ.. నరేషన్ అవ్వగానే ‘మాస్ జాతర’ అంటూ టైటిల్ సూచించాడట. తనకు అది కూడా బాగా నచ్చడంతో ఆ టైటిలే కన్ఫమ్ చేశానని భాను తెలిపాడు. ఐతే ఈ టైటిల్‌కు పెట్టిన క్యాప్షన్ మాత్రం తన క్రెడిటే అని భాను తెలిపాడు.
కానీ ‘మనదే ఇదంతా’ అనే క్యాప్షన్ చెప్పినపుడు రవితేజ అది వద్దు అని అన్నాడట. ఐతే ముందు పెట్టి చూద్దాం, తర్వాత వద్దనుకుంటే తీసేద్దాం అని భాను చెప్పగా.. రవితేజ సరే అని చెప్పాడట. చివరికి ఆ క్యాప్షన్ కూడా బాగుందని దాన్ని ఖరారు చేశారట. ఈ చిత్రంలో రవితేజ రైల్వే పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సినిమాలో తన భాష, యాస, బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటాయని దర్శకుడు, హీరోయిన్ శ్రీలీలతో కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో రవితేజ వెల్లడించాడు. తాను ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అవీ బాగానే ఫాలో అవుతానని.. వాటిని ఎంజాయ్ చేస్తానని.. కానీ ట్విట్టర్ అంటే మాత్రం నచ్చదని రవితేజ తెలిపాడు. ఇక్కడంతా నెగెటివిటీనే ఉంటుందని.. ఈ బ్యాచ్ అంతా వేరే అని, అందుకే తాను ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండనని రవితేజ తెలిపాడు. ‘మాస్ జాతర’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates