బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ అనుకున్నట్టే వీక్ డేస్ లో కొంచెం నెమ్మదించినప్పటికీ మరీ భయపడే డ్రాప్స్ కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా పెద్దది కావడంతో లాభాలు అందుకోవడం గురించి బయ్యర్లు కాసింత అనుమానంగానే ఉన్నారు. మైత్రి భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వల్ల అంత పెద్ద నెంబర్లు రావాలంటే తొలి రెండు వారాలు పుష్ప 2, ఆర్ఆర్ఆర్ రేంజ్ లో ఆడాలని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. టాక్ ఎంత యునానిమస్ గా ఉన్నప్పటికీ డబ్బింగ్ మూవీ అందులోనూ డివోషనల్ కంటెంట్ కావడంతో ఆ స్థాయి రీచ్ రావడం పెద్ద ఛాలెంజే.
ఊహించని విధంగా ఉత్తరాది రాష్ట్రాలు, తమిళనాడులో కాంతార చాప్టర్ 1 అనూహ్యంగా పికప్ కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. కన్నడలో ఆల్రెడీ వంద కోట్ల మార్కు దాటేయగా ఒక్క సోమవారమే పదహారు కోట్లు వచ్చిందనే సమాచారం ఇప్పట్లో ఇది నెమ్మదించడం అసాధ్యమనే సంకేతం ఇస్తోంది. కర్ణాటక వీక్ డేస్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. టికెట్ రేట్ల విషయంలో కోర్టు తీర్పు అనుకూలంగా రావడం కాంతారకు చేసిన మేలు అంతా ఇంతా కాదు. ఈ ఒక్క జడ్జ్ మెంట్ వల్లే ఎంతలేదన్నా ఓ యాభై నుంచి అరవై కోట్ల వ్యత్యాసం రాకుండా తప్పించుకోగలిగామని శాండల్ వుడ్ బయ్యర్స్ టాక్.
ఇక దీపావళి దాకా కాంతారకు కళ్లెం పడేలా లేదు. ఎందుకంటే తెలుగులో ఈ వారం రిలీజవుతున్న సినిమాలన్నీ యూత్ ఫుల్ కంటెంట్ ఉన్నవి. తెలుసు కదా, కె రాంప్, డ్యూడ్, మిత్రమండలి కుటుంబాల కన్నా యువతని డిమాండ్ చేస్తున్నవి. సో ఫ్యామిలీస్ కి తిరిగి కాంతారనే ఫస్ట్ ఆప్షన్ కావొచ్చు. అయిదు వందల కోట్ల వైపు పరుగులు పెడుతున్న కాంతార చాప్టర్ 1 నార్త్ అమెరికాలో మాత్రం ఎదురీదుతోంది. మూడు మిలియన్లు చేరువలో ఉన్నప్పటికీ ఇంకో నాలుగు మిలియన్ల టార్గెట్ ఉందట. ఒరిజినల్ వెర్షన్ మాత్రం ఎవరూ ఆపలేరనే తరహాలో పరుగులు పెడుతోంది. అక్టోబర్ నెలాఖరు దాకా డామినేషన్ ఉండొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates