మాస్ జాతరని నిలబెట్టాల్సింది అవే

ఇంకో పాతిక రోజుల్లో మాస్ జాతర విడుదల కానుంది. ఇప్పటిదాకా బోలెడు వాయిదాలు వేసుకుంటూ వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఎట్టకేలకు అక్టోబర్ 31 లాక్ చేసుకుని హమ్మయ్యా అనిపించుకుంది. ఆ రోజు పెద్దగా పోటీ లేదు. బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్, విష్ణు విశాల్ ఆర్యన్ తప్ప చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. అలాని రవితేజని రోడ్ క్లియర్ ఉందని కాదు. అత్యవసరంగా దీని మీద బజ్ పెంచాలి. దానికి ప్రమోషన్లు చాలా కీలకం కాబోతున్నాయి. కిషోర్ తిరుమల సినిమా కోసం విదేశాలకు వెళుతుండటంతో రవితేజ అప్పటికప్పుడు కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చేసి తన వంతు బాధ్యతగా పబ్లిసిటీలో భాగమయ్యాడు.

మాస్ జాతరకు హైప్ ఎంత ఉందనేది పక్కనపెడితే ప్రధానంగా కొన్ని విషయాల గురించి యూనిట్ పాజిటివ్ గా మాట్లాడుతోంది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఫైట్లు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయని అంటోంది. రాజేంద్రప్రసాద్, రవితేజల మధ్య పెట్టిన తాత మనవడు ట్రాక్ వినోదంతో పాటు ఎమోషన్ ని పంచుతూ ఫ్యామిలీ ఆడియన్స్ ని కదిలిస్తుందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో శ్రీలీల లవ్ ట్రాక్, భీమ్స్ హుషారైన పాటలు, పోలీస్ డ్రెస్సులో రవితేజ మార్కు కామెడీలతో కాలక్షేపం జరిగిపోయి, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ దాకా కథనం పరుగులు పెడుతూనే ఉంటుందని ఊరిస్తున్నారు.

అర్జెంట్ గా మాస్ జాతర నుంచి ఒక వైరల్ సాంగ్ రావాలి. ధమాకాలో జింతాక జింతాక తరహాలో చార్ట్ బస్టర్ ఒకటి జనంలోకి వెళ్తే ఓపెనింగ్స్ కి బాగా ఉపయోగపడుతుంది. అలాంటి రెండు పాటలు భీమ్స్ ఇచ్చాడట. సరైన సమయం చూసి వాటిని వాడుకునేందుకు టీమ్ రెడీ అవుతోంది. నిర్మాత నాగవంశీకి సైతం దీని సక్సెస్ చాలా కీలకం. కింగ్డమ్ ఫెయిల్యూర్, వార్ 2 డిస్ట్రిబ్యూషన్ తీవ్ర నష్టాలు తెచ్చి పెట్టాయి. ఇప్పుడీ మాస్ జాతర కనక వర్కౌట్ అయితే తిరిగి ట్రాక్ లో పడొచ్చు. మాస్ జాతర విడుదలైన రెండున్నర నెలలకే రవితేజ మరో సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి (ప్రచారంలో ఉన్న టైటిల్) సంక్రాంతి పండక్కు దిగుతుంది.