చరిత్ర మార్చిన ఛత్రపతికి 20 ఏళ్ళు

సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం 2005. ప్రభాస్ ఇంకా పూర్తి స్థాయి మాస్ స్టార్ గా ఎదగలేదు. వర్షం బ్లాక్ బస్టర్ తర్వాత వరసగా రెండు ఫ్లాపులు అడవి రాముడు, చక్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో పునఃపరిశీలనలో ఉన్న సమయమది. అదే టైంలో రాజమౌళితో సినిమా తీయాలని నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తెగ ప్రయత్నిస్తున్నారు. మిత్రుడు కీరవాణి ద్వారా జరిపిన రాయబారం ఫలితమిచ్చింది. రచయిత విజయేంద్ర ప్రసాద్ ఎప్పుడో 1988లో రాసుకున్న ఒక మదర్ సెంటిమెంట్ కథని బయటికి తీశారు. దాన్ని ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ప్రభాస్ మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని రెడీ చేశారు.

ఒక తల్లికి ఇద్దరు కొడుకుల్లో ఒకడు దూరమై మంచివాడిగా, ఇంకొకడు చెడ్డవాడిగా పెరుగుతాడు. ఈ ఫ్యామిలీ థ్రెడ్ ని వలసవాదం, మాఫియా, నేర సామ్రాజ్యం లాంటి ఎలిమెంట్స్ తో ముడిపెడుతూ అద్భుతమైన ట్రీట్ మెంట్ తో ఛత్రపతిని రాయించుకున్నారు. అప్పటికే సినిమాల మీద ఆసక్తి తగ్గిపోయిన భానుప్రియ అమెరికా వెళ్లే ప్లాన్ లో ఉంటే రాజమౌళి పంతం మీద కథ విని తర్వాత మారు మాట్లాడకుండా సంతకం చేశారు. హీరోయిన్ గా శ్రేయని లాక్ చేసుకుని మెయిన్ విలన్ గా ప్రదీప్ రావత్ ని ఎంచుకున్నారు. కాట్రాజు పాత్ర కోసం సుప్రీత్ చాలా కష్టపడ్డాడు. కీరవాణి నుంచి అదిరిపోయే ట్యూన్స్ వచ్చేశాయి. ఎం రత్నం మాటలు తూటాల్లా కుదిరాయి.

ఏడు నెలల్లో షూటింగ్ అయిపోయింది. అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువయ్యింది. పదమూడు కోట్లు ఆ టైంలో ఎక్కువే. అయినా సరే బిజినెస్ ఆఫర్స్ క్రేజీగా వచ్చాయి. టేబుల్ ప్రాఫిట్స్ ప్రసాద్ గారిని ముంచెత్తాయి. సెప్టెంబర్ 30 థియేటర్లలో అడుగు పెట్టిన ఛత్రపతికి ముందు డివైడ్ టాక్ వచ్చింది. సెకండాఫ్ మీద కంప్లైంట్స్ వినిపించాయి. కానీ రెండు రోజుల తర్వాత సీన్ రివర్స్. ఒక్క అడుగు అంటూ కోట దగ్గర ప్రభాస్ చూపించిన పెర్ఫార్మన్స్, బీచ్ లో ఫైట్, హుషారైన పాటలు ఒకదాన్ని మించి మరొకటి అభిమానులతో పాటు మాములు మాస్ ప్రేక్షకులను సైతం ఊపేశాయి. 54 సెంటర్లలో వంద రోజులు ఆడటం రికార్డు. ఛత్రపతి వేసిన పునాదే తర్వాతి రోజుల్లో బాహుబలికి శ్రీకారం చుట్టూ టాలీవుడ్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది.