‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఆ ఒక్క సినిమాతో తన రేంజ్ మారిపోయింది. ఇదే చిత్రాన్ని హిందీలో పెద్ద బడ్జెట్ పెట్టి ‘కబీర్ సింగ్’గా తీస్తే అక్కడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత ‘యానిమల్’తో సందీప్ ఎంత పెద్ద రేంజికి వెళ్లాడో తెలిసిందే. ఆ సినిమా ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిది. దీంతో సందీప్ రెడ్డి తర్వాతి చిత్రం స్కేల్ ఇంకా పెరిగిపోయింది.
ఈసారి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తీయబోతున్నాడు వంగ. అది ఇండియాలోనే అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా నిలవడం ఖాయం. ఇలాంటి పెద్ద సినిమా చేస్తూనే.. తెలుగులో ఓ చిన్న చిత్రం తీయడానికి రెడీ అయ్యాడు సందీప్. ఐతే అది దర్శకుడిగా కాదు.. నిర్మాతగా. ‘అర్జున్ రెడ్డి’తో మొదలుపెట్టిన భద్రకాళి ఫిలిమ్స్ బేనర్ మీద సందీప్ కొత్త సినిమాకు రంగం సిద్ధం చేశాడు.
‘మ్యాడ్’ మూవీతో కథానాయికగా పరిచయం అయి.. లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘8 వసంతాలు’తో మంచి పేరు సంపాదించిన మలయాళ యంగ్ హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ ఈ చిత్రంలో కథానాయికగా నటించనుంది. తెలుగు తన రెండు చిత్రాలకు భిన్నంగా ఈసారి తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలో నటించబోతోంది అనంతిక. ఇందులు ‘మేం ఫేమస్’ ఫేమ్ సుమంత్ అశ్విన్.. అనంతికకు జోడీగా నటిస్తాడట.
వేణు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. తెలంగాణ వాసి అయిన సందీప్.. ఇక్కడి నేటివిటీతో తెరకెక్కే సినిమాలకు ముందు నుంచి సపోర్ట్ చేస్తున్నాడు. ‘పొట్టేల్’ సహా పలు చిత్రాలకు సాయం అందించాడు. ఇప్పుడు ఇక్కడి లోకల్ స్టోరీలకు తన నిర్మాణ సంస్థ ద్వారా అండగా నిలవాలనుకుంటున్నాడు. ఇది సక్సెస్ అయితే ఇక ముందూ సందీప్ బేనర్ నుంచి ఇలాంటి చిన్న సినిమాలు మరిన్ని రావచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates