ఒకపక్క పవన్ ఓజి, ఇంకోవైపు కాంతార చాప్టర్ 1 పెట్టుకుని మధ్యలో ఇడ్లీ కొట్టుతో వస్తున్న ధనుష్ ధైర్యం చూసి ఆశ్చర్యపోయినవాళ్ళే ఎక్కువ. దానికి సమాధానం ఇవాళ ట్రైలర్ లో ఇచ్చారు. తన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎమోషనల్ డ్రామా అక్టోబర్ 1 విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా రిలీజ్ చేయబోతున్నారు. మాములుగా ఇలాంటి సినిమాల కథలను ఎక్కువ రివీల్ చేయరు. కానీ ధనుష్ అలాంటి లెక్కలేమి వేసుకోకుండా మొత్తం స్టోరీని అరటిపండు వలిచినట్టు రెండున్నర నిమిషాల్లో చెప్పేశాడు. ఆర్టిస్టులందరినీ రివీల్ చేసి క్లారిటీ ఇచ్చేశాడు.
వంశ పారంపర్యంగా తండ్రి (రాజ్ కిరణ్) స్థాపించిన ఇడ్లి కొట్టుని కాదనుకుని కొడుకు (ధనుష్) విదేశాలకు వెళ్లి ఒక కార్పొరేట్ హోటల్ లో ఉద్యోగానికి చేరతాడు. ఎంత జీతం సంపాదించినా, వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి చేసినా తననో పనివాడిగా గుర్తిస్తున్నారని భావించిన అతను స్వగ్రామం తిరిగి వచ్చి మూతబడిన కొట్టుని తీస్తాడు. భార్య (నిత్య మీనన్) తో పాటు ఇడ్లిలు అమ్మడమే పనిగా పెట్టుకుంటాడు. ఈ క్రమంలో అతను పని చేసిన ఫారిన్ కంపెనీ యజమాని కొడుకు (అరుణ్ విజయ్) ఇండియా వచ్చి హీరో మీద యుద్ధం ప్రకటిస్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటనేది తెరమీద చూడాల్సిందే.
లైన్ పరంగా సింపుల్ గా అనిపించినా ఆడియన్స్ కి వేగంగా కనెక్ట్ అయ్యే ఇడ్లీల వ్యాపారాన్ని తీసుకున్న ధనుష్ దానికి తగ్గట్టే భావోద్వేగాలను సరైన రీతిలో సమకూర్చినట్టు విజువల్స్ చూస్తే అర్థమైపోతుంది. ముఖ్యంగా ఆర్టిస్టుల ఎంపిక, జివి ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం, బలమైన సాంకేతిక వర్గం వెరసి ఫ్యామిలీ ఆడియన్స్ ని గట్టిగా టార్గెట్ చేసేలా ఉంది. కాకపోతే తమిళ నేటివిటీ ఎక్కువగా ఉండే ఇలాంటి నేపధ్యాలను మన ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. రాయన్ తో దర్శకుడిగా అందరినీ మెప్పించలేకపోయిన ధనుష్ ఈసారి విలేజ్ డ్రామాతో క్లాసు మాస్ ని బాలన్స్ గా టార్గెట్ చేశాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates