టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా సింపుల్ లైఫ్ స్టైల్ అంటే విక్టరీ వెంకటేష్‌దే. ఎప్పుడూ ఆధ్యాత్మికత గురించి మాట్లాడే వెంకీ.. చాలా సింపుల్‌గా కనిపిస్తుంటారు. సినిమాల పరంగా చూసినా వెంకీ బిల్డప్పులకు దూరంగా ఉంటారు. ఆయన సింప్లిసిటీ గురించి కలిసి పని చేసిన వాళ్లందరూ గొప్పగా చెబుతుంటారు. వెంకీ గొప్పదనం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో కన్నడ నటుడు వశిష్ఠ సింహా ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. కేజీఎఫ్‌తో పాపులర్ అయిన వశిష్ఠ.. తెలుగులో నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్, ఓదెల-2 సహా పలు చిత్రాల్లో నటించాడు. వెంకీతో చేసిన నారప్ప గురించి అతను మాట్లాడుతూ.. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వెంకీ తనను చెప్పుతో కొట్టే సన్నివేశం చిత్రీకరణ సందర్భంగా ఏం జరిగిందో వెల్లడించాడు.
ఈ సీన్ గురించి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పినపుడు.. తాను కొంత ఇబ్బంది పడ్డట్లు చెప్పాడు వశిష్ఠ. ఐతే ఆ సన్నివేశాన్ని కంఫర్టబుల్‌గానే తీద్దామని శ్రీకాంత్ చెప్పినట్లు తెలిపాడు. ఆ సన్నివేశం తీసేటపుడు సెట్‌కు వచ్చిన వెంకీ.. తనను కొట్టాల్సిన డమ్మీ చెప్పును ఒకసారి చూసి.. దాంతో తనను ఎలా కొట్టాలా అని కాస్త సంశయించినట్లు చెప్పాడు వశిష్ఠ. ఐతే తాను ఏం పర్లేదు అని చెప్పినప్పటికీ.. ముందు వెంకీ ఆ డమ్మీ చెప్పుతో పలుమార్లు చెంప మీద కొట్టుకుని.. దాంతో పెద్దగా ఇబ్బంది లేదని చూపించాకే ఆ సన్నివేశం చిత్రీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వశిష్ఠ సింహా వెల్లడించాడు.
అంత పెద్ద స్టార్ అయి ఉండి.. తన లాంటి చిన్న నటుడిని కంఫర్టబుల్‌గా ఉంచడానికి వెంకీ అలా చేయడం గొప్ప విషయమని.. ఆయన జెంటిల్మన్ అని వశిష్ఠ సింహా కొనియాడాడు. నారప్పలో వెంకీ కూడా చెప్పు దెబ్బ తినే సీన్ ఉంటుంది. అంతే కాక ఊరిలో ప్రతి ఇంటి ముందు సాగిలపడి క్షమాపణ చెప్పే సన్నవేశం కూడా ఈ సినిమాలో భాగం. పెద్ద స్టార్, ఎంతో సీనియర్ అయినప్పటికీ వెంకీ ఇమేజ్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఈ సన్నివేశాల్లో నటించడం గొప్ప విషయం. తమిళ బ్లాక్ బస్టర్ అసురన్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కరోనా టైంలో నేరుగా ఓటీటీలో రిలీజై ఓ మోస్తరు స్పందన తెచ్చుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates