హరి గౌరను హర్ట్ చేసిన ‘హనుమాన్’

హరి గౌర.. ఇప్పుడు టాలీవుడ్లో మార్మోగుతున్న పేరు. గత శుక్రవారం రిలీజై బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళ్తున్న ‘మిరాయ్’ సినిమాకు ఇతనే సంగీత దర్శకుడు. ఈ సినిమా సక్సెస్ మీట్లో విలన్ పాత్రధారి మంచు మనోజ్ మాట్లాడుతూ.. సమీక్షల్లో, ప్రేక్షకులు ఇస్తున్న ఫీడ్ బ్యాక్‌లో ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ కంటే ముందు హరి గౌర సంగీతం గురించి ప్రస్తావిస్తుండడం.. అతనే సినిమాకు అసలైన హీరో అనడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అంతే కాక హరికి మనోజ్ పాదాభివందనం కూడా చేశాడు. 

మనోజ్ మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదు. అతనంత ఎగ్జైట్ కావడంలో ఆశ్చర్యం లేదు. థీమ్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో ఈ సినిమాకు అతను ఇచ్చిన ఎలివేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాకు అంత కసితో పని చేయడానికి కారణం ఉందని హరి గౌర చెప్పాడు. తాను ఎంతో కష్టపడి సంగీతం సమకూర్చిన ‘హనుమాన్’ విషయంలో తనకు రావాల్సిన క్రెడిట్ రాకపోవడమే ‘మిరాయ్’ విషయంలో కసిని పెంచిందని అతను చెప్పాడు.

హనుమాన్ సినిమా నిడివి 2 గంటల 38 నిమిషాలైతే.. రెండున్నర గంటల రన్ టైంకు తానే సంగీతం అందించానని.. మిగిలిన సమయంలో ఇద్దరు రెండు పాటలు ఇచ్చారని.. దీంతో ఈ సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు పని చేశారని చెబుతూ, తనకు రావాల్సిన గుర్తింపును వేరే వాళ్లకు పంచడం తనకు ఆవేదన కలిగించిందని హరి తెలిపాడు. 

అందుకే ఈసారి చేస్తే హరి గౌర ఒక్కడే చేశాడు అని అందరూ చెప్పుకునేలా ఉండాలని ‘మిరాయ్’కి చాలా కసితో పని చేశానని.. ఇప్పుడు దీనికి రావాల్సిన గుర్తింపు రావడం తనకెంతో ఆనందంగా ఉందని హరి గౌర చెప్పాడు. ‘మిరాయ్’ తీసిన పీపుల్ మీడియా బేనర్లోనే హరి ఇంకో నాలుగు సినిమాలకు పని చేస్తుండడం విశేషం. ‘జాంబిరెడ్డి-2’తో పాటు ‘పినాక’, ‘రణమండల’, ‘కాలచక్ర’ అంటూ ఆ నాలుగు చిత్రాల వివరాలు వెల్లడించాడు హరి.