ధనుష్ మళ్లీ ఎందుకు ట్రోల్ అవుతున్నాడు?

తమిళ ఫిలిం ఇండస్ట్రీలో పెద్దగా బ్యాగ్రౌండ్ లేకపోయినా, తన టాలెంటుతో స్టార్ హీరోగా ఎదిగాడు ధనుష్‌. రెండుసార్లు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అతడికి భారీగా అభిమాన గణం ఉంది. ఐతే ధనుష్‌కు యాంటీ ఫ్యాన్స్ కూడా తక్కువేమీ కాదు. స్టార్ హీరోల మధ్య ఉండే పోటీ వల్ల ఒక హీరో ఫ్యాన్స్.. ఇంకో హీరోను సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం కొత్తేమీ కాదు. ఈ విషయంలో ధనుష్‌కు సామాజిక మాధ్యమాల్లో కాస్త ఎక్కువగానే యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లు తన సినిమాలు రిలీజైనపుడు గట్టిగా డ్యూటీ చేస్తుంటారు. 

అలాగే ధనుష్ ఏదైనా వివాదాస్పదంగా మాట్లాడితే విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. తన సినిమాల ఆడియో ఈవెంట్లు జరిగినపుడల్లా ధనుష్ తన స్పీచ్‌ల వల్ల సోషల్ మీడియాకు టార్గెట్ మామూలే. సీనియర్ దర్శకుడు కార్తీక్ రాజా తనయుడు అయిన ధనుష్.. తాను చాలా పేద కుటుంబం నుంచి వచ్చినట్లు చెప్పడాన్ని యాంటీ ఫ్యాన్స్ తప్పుబడుతుంటారు. ఇంతకుముందు ఓ ఆడియో వేడుకలో ఇలాగే మాట్లాడితే ట్రోల్ అయ్యాడు ధనుష్.

ఇప్పుడు మరోసారి ధనుష్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘ఇడ్లి కడై’ ఆడియో వేడుకలో చిన్నప్పటి కష్టాలను ఏకరవు పెట్టాడు ధనుష్. చిన్నతనంలో తనకు ప్రతి రోజూ ఇడ్లీ తినాలని ఉండేదని.. కానీ ఎప్పుడో కానీ ఆ కోరిక తీరేది కాదని.. ఇప్పుడు స్టార్ హోటళ్లలో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నా రుచి తెలియడం లేదని అతను చెప్పుకొచ్చాడు. చిన్నపుడు ఇడ్లీ కొట్టుతో తనుకున్న ఎమోషనే ఈ సినిమా అని అతను చెప్పాడు. 

ఐతే ధనుష్ చిన్నతనంలో ఉన్నపుడే కార్తీక్ రాజా అసిస్టెంట్ డైరెక్టర్ అని.. ధనుష్ చెబుతున్నంత కష్టాలు అతడికి చిన్నతనంలో లేవని.. సింపతీ కోసమే ఇదంతా చేస్తున్నాడని.. అతడికిది అలవాటే అని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఐతే గతంలో సీనియర్ దర్శకుడు, రచయిత విస్సు చెప్పిన దాని ప్రకారం.. కార్తీక్ రాజా చాన్నాళ్ల పాటు ఆయన దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.

దర్శకుడు  కావడానికి చాలా టైం పట్టింది. ఏడీగా ఉండగా తన ఆదాయం అంతంతమాత్రం. వాళ్ల ఇంట్లో టీవీ కూడా లేకపోతే.. వారానికోసారి ఆయన పిల్లలు తన ఇంటికి వచ్చి టీవీ చూసేవారని ఓ సందర్భంలో చెప్పారు. కాబట్టి ధనుష్‌ చిన్నప్పటి కష్టాల గురించి చెబుతున్నదాంట్లో అతిశయోక్తి ఏమీ లేదని.. అతణ్ని ఈ కారణంతో ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని తన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.