టాక్ ఆఫ్ ద టౌన్… అద్భుతం హ‌రి గౌర‌

టాలీవుడ్లో ఏ పెద్ద సినిమా వ‌చ్చినా అయితే త‌మ‌న్.. లేదంటే దేవిశ్రీ ప్ర‌సాద్.. కాదంటే అనిరుధ్ ర‌విచంద‌ర్.. ఈ ముగ్గురిలో ఒక‌రు సంగీత ద‌ర్శ‌కులుగా ఉంటారు. కీర‌వాణి రాజ‌మౌళి సినిమాల‌ను దాటి ప‌ని చేసే చిత్రాలు చాలా త‌క్కువ‌. మిడ్ రేంజ్ సినిమాలు తీసే వాళ్లు కూడా కొన్నేళ్ల నుంచి పై ముగ్గురి వైపే చూస్తున్నారు. తెలుగులో ప్ర‌తిభావంతులైన యువ సంగీత ద‌ర్శ‌కులు ఉన్న‌ప్ప‌టికీ.. మిడ్ రేంజ్ చిత్రాల‌కు వారి వైపు చూడ‌కుండా  ప‌ర‌భాషా మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌నే ఎక్కువ ఆశ్ర‌యిస్తున్నారు మ‌న ఫిలిం మేక‌ర్స్. ఇలాంటి స‌మ‌యంలో ఓ యువ సంగీత ద‌ర్శ‌కుడు త‌న మ్యూజిక్‌లో ఉన్న ప‌వ‌రేంటో చాటి చెబుతూ.. ఇండ‌స్ట్రీ మొత్తం త‌న వైపు చూసేలా చేస్తున్నాడు. అత‌నే.. హ‌రి గౌర‌.

ఇది మొన్న‌టిదాకా పెద్ద‌గా పాపుల‌ర్ కాని పేరు. కానీ మిరాయ్ సినిమా రిలీజ్ త‌ర్వాత హ‌రి గౌర పేరు సోష‌ల్ మీడియాలో మార్మోగిపోతోంది. మిరాయ్ రివ్యూల్లో అంద‌రూ ఎక్కువ‌గా కొనియాడింది హ‌రి సంగీతం గురించే. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విష‌యంలో అత‌ను పెట్టిన ఎఫ‌ర్ట్, చూపించిన ప్ర‌భావం గురించి ఎంత చెప్పినా త‌క్కువే.  క‌థ‌లో కీల‌క‌మైన ఘ‌ట్టాల్లో అత‌డి నేప‌థ్య సంగీతం ప్రేక్ష‌కుల‌కు గూస్ బంప్స్ ఇచ్చింది. భారీ ప‌క్షి అవ‌తారంతో ముడిప‌డ్డ ఇంట‌ర్వెల్ ఎపిసోడ్లో స్కోర్ అద్భుతం అనే చెప్పాలి. ద్వితీయార్ధ‌మంతా ఒక హై ఇస్తూనే సాగింది ఆర్ఆర్. ప‌తాక ఘ‌ట్టాల్లో థీమ్ మ్యూజిక్, స్కోర్ వేరే లెవెల్లో సాగాయి.

హ‌రి గౌర పేరు ముందుగా వినిపించింది హ‌నుమాన్ టైంలో. ఆ సినిమాకు మంచి పాట‌లు, అదిరిపోయే స్కోర్ అందించాడు. కానీ అంత‌కుముందు రెండు చిన్న సినిమాలు చేసినా పెద్ద‌గా గుర్తింపు రాలేదు. హ‌నుమాన్ రూపంలో వ‌చ్చిన గొప్ప అవ‌కాశాన్ని అత‌ను బాగా ఉప‌యోగించుకున్నాడు. ఇప్పుడు మిరాయ్‌తో అంత‌కుమించి అప్లాజ్ అందుకుంటున్నాడు. హ‌నుమాన్ త‌ర్వాత చాలా అవ‌కాశాలు వ‌చ్చినా వ‌ద్దనుకుని రెండేళ్ల పాటు ఈ సినిమాకే అత‌ను అంకితం అయ్యాడ‌ని.. ఈ సినిమాను అత‌నెంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడో చెప్ప‌డానికి ఉదాహ‌ర‌ణ అని.. సినిమాకు సంబంధించి ఆర్టిస్టుల‌ను మించి అంద‌రూ హ‌రిని కొనియాడుతుంటే చాలా ఆనందంగా ఉంద‌ని హీరో తేజ స‌జ్జ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమా తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేన‌ర్లోనే మూణ్నాలుగు పెద్ద సినిమాల‌కు హ‌రి గౌర సంగీతం అందించ‌బోతున్నాడ‌ట‌.