వీరమల్లు వదిలేసిన 40 నిమిషాల కహాని

జరిగిందేదో జరిగిపోయింది కానీ హరిహర వీరమల్లు డిజాస్టర్ అభిమానులు అంత సులభంగా మర్చిపోయేది కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తొలి ప్యాన్ ఇండియా మూవీగా నిర్మాణం ఎంత ఆలస్యమైనప్పటికీ హిట్టయితే చాలనే నమ్మకంతో ఎదురు చూశారు. దర్శకుడి మార్పు గురించి ముందు నుంచి అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చినా చివరికి ఆ భయమే నిజమైపోయి సినిమా దారుణంగా పోయింది. ఓటిటిలో వచ్చాక కూడా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోకపోవడం ఫలితం ఎంత తీవ్రంగా వచ్చిందో స్పష్టం చేస్తుంది. అయితే మొదట దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన క్రిష్ తాజాగా ఘాటీ ప్రమోషన్లలో కొన్ని కీలక విషయాలు చెప్పుకొచ్చారు.

తాను తీసిన 40 నిమిషాలు రెండో భాగంలో వస్తుందని, ఔరంగజేబు ఢిల్లీకి వెళ్ళాక జరిగే పరిణామాలు తాను తీశానని అంటున్నారు. కోహినూర్ వజ్రం కొట్టేశాక మయూర్ సింహాసనం మీద కూర్చోవడం, ఔరంగజేబుకి సై అంటే సై అంటూ సవాల్ చేయడం లాంటి కీలక సన్నివేశాలన్నీ అందులో వస్తాయట. స్టంట్స్ కూడా గొప్పగా వచ్చాయట. పెద్ద సెట్ వేసి దర్బార్ లోనే వీటి షూట్ జరిగిందని చెప్పుకొచ్చారు. ఒకవేళ సీక్వెల్ ఆలోచన చేయకుండా కేవలం సింగల్ మూవీగా హరిహర వీరమల్లు తీసి ఉంటే ఖచ్చితంగా బెటర్ అవుట్ ఫుట్ అయ్యేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ బ్యాడ్ లక్ జరిగింది వేరు.

హరిహర వీరమల్లు పార్ట్ 2 బ్యాటిల్ ఫీల్డ్ వస్తుందనే నమ్మకం ఫ్యాన్స్ లో అయితే లేదు. ఇంకా చాలా భాగం తీయాల్సి ఉంది. ఇప్పుడొచ్చిన రిజల్ట్ కి మళ్ళీ బయ్యర్లు రావడం అనుమానమే. యావరేజ్ అయినా సరే ఏదోలా పవన్ కళ్యాణ్ నెట్టుకొచ్చేవారు కానీ మరీ ఇంత అన్యాయంగా ఫ్లాప్ కావడం ఊహించనిది. అయినా రెండు భాగాలు తీస్తే గట్టెక్కుతామనే భ్రమ నుంచి నిర్మాతలు బయటికి వచ్చే దాకా అవసరం లేని సీక్వెల్స్ ప్రహసనం జరుగుతూనే ఉంటుంది. కెజిఎఫ్, బాహుబలి, పుష్ప సబ్జెక్టులు డిమాండ్ చేశాయి కాబట్టి పార్ట్ 2 సక్సెస్ అయ్యాయి. కానీ అన్నింటికి అదే ఫలితం రిపీటవుతుందనుకుంటే పొరపాటే.