చాప కింద నీరులా ఏఐ (కృత్రిమ మేధస్సు) మన జీవితంలోకి వచ్చేస్తోంది. రెండు రోజులు పట్టే పనిని కేవలం రెండు నిమిషాల్లో చేసే టెక్నాలజీని చూసి విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ప్రమాదం, ప్రమోదం రెండూ మోసుకొస్తున్న దీని తీరుకి ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో అంచనా వేయలేకపోతున్నారు. ఏది ఒరిజినలో ఏది నకిలీనో గుర్తు పట్టలేక సామాన్యులు సతమతమవుతున్నారు. ఆచార్య, గుడ్ బ్యాడ్ అగ్లీ లాంటి సినిమాల్లో హీరోలు యువకులుగా కనిపించిన వైనం చూసి ఆడియన్స్ షాక్ తిన్నారు. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. దర్శకుడు లోకేష్ కనగరాజ్ అదే చెబుతున్నాడు.
కూలీతో అంచనాలు అందుకోలేకపోయిన ఈ బ్లాక్ బస్టర్ దర్శకుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా సంవత్సరాల క్రితం విశ్వరూపంని ఓటిటి రిలీజ్ చేద్దామని కమల్ హాసన్ ప్రకటించినప్పుడు అందరూ వ్యతిరేకించారని, కానీ ఇప్పుడు ఓటిటిలు లేకుండా సినిమాలు తీయలేని, రిలీజ్ చేయలేని పరిస్థితి తలెత్తిందని చెప్పుకొచ్చాడు. గతంలో అసాధ్యం అనుకున్నది ఇప్పుడు సామాన్యం అయిపోయిందని వివరించాడు. విక్రమ్ లాంటి నటులు ఏఐలో చేస్తే ఆడియన్స్ చూస్తారా లేక నిజంగా కష్టపడితే థియేటర్లకు వస్తారా అంటూ ప్రశ్న సంధించి రాబోయే తరాలు చూడబోయే ఎక్స్ పీరియన్స్ ని ముందే హింట్ ఇస్తున్నాడు.
ప్రాథమిక దశలో ఉండగానే ఏఐ ఇంతగా ప్రభావం చూపిస్తోందంటే రాబోయే రోజుల్లో ఇంకెలాంటి పరిణామాలు జరగబోతున్నాయో లోకేష్ కనగరాజ్ ముందస్తు సూచనలు చేస్తున్నాడు. తను చెప్పింది ఆలోచించాల్సిన విషయమే. కూలీ ఫ్లాష్ బ్యాక్ లో రజనీకాంత్ కుర్రాడిగా కనిపించడం, చనిపోయిన విజయ్ కాంత్ గోట్ లో క్యామియో చేయడం ఇవన్నీ ఏఐ తాలూకు మాయాజాలాలే. వీటిని మరింత విస్తృతంగా వాడుకునేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఓ పది ఇరవై సంవత్సరాల తర్వాత అసలు ఆర్టిస్టులు నటించే అవసరమే లేకుండా కేవలం వాళ్ళను వాడుకున్నందుకు డబ్బులు ఇచ్చి సినిమాలు తీసేస్తారేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates