పేరు మార్చుకుని వచ్చిన మంచు లక్ష్మి

మోహన్ బాబు ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన ముగ్గురు తారల్లో ఎవరి కెరీర్ కూడా ఆశించినంత గొప్పగా లేదు. గత దశాబ్ద కాలంగా ముగ్గురూ స్ట్రగులవుతూనే ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత ‘కన్నప్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష్ణు.. కోరుకున్న విజయాన్ని అందుకోలేకపోయాడు. మంచు మనోజ్ రీఎంట్రీ మూవీ ‘భైరవం’ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. మరోవైపు మంచు లక్ష్మి తెరపై కనిపించి చాలా కాలమైంది. ఆమె ఎప్పుడో పూర్తి చేసిన సినిమా ‘అగ్నినక్షత్రం’ సంగతి అసలేమైందో కూడా తెలియదు. ఐతే ఇప్పుడు సడెన్‌గా లక్ష్మి ‘దక్ష’ అనే సినిమా టీజర్‌తో పలకరించింది.

ఐతే ఇదేమీ కొత్త సినిమా కాదు. ‘అగ్నినక్షత్రం’ చిత్రానికే పేరు మార్చారు. వినాయక చవితి కానుకగా ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. విచిత్రమైన వేషధారణతో హత్యలు చేసే ఒక కిల్లర్‌ను వెతికి పట్టుకునే పోలీసాఫీసర్‌ కథ ఇది. విలన్ పాత్రే సినిమాలో హైలైట్‌గా ఉండేలా కనిపిస్తోంది. ఇలాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు ఓటీటీల్లో బోలెడు చూస్తున్నాం. సినిమాలు కూడా పెరుగుతున్నాయి.

ట్రెండుకు తగ్గ కథనే ఎంచుకుని రేసీ స్క్రీన్ ప్లేతో నడిపించాలని చూసినట్లున్నాడు దర్శకుడు వంశీకృష్ణ. లక్ష్మి పాత్ర పవర్‌ ఫుల్‌గానే కనిపిస్తోంది. ఒక డైలాగ్‌తో మాస్ చూపించింది లక్ష్మి. ఇందులో మోహన్ బాబు సైతం ఓ ముఖ్య పాత్ర పోషించాడు. టీజర్లో కొసమెరుపులా ఆయన పాత్ర కనిపించింది. సముద్రఖని, విశ్వాంత్, చిత్ర శుక్లా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. టీజర్‌తో పాటే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. సెప్టెంబరు 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘దక్ష’. ఈ చిత్రాన్ని మంచు ఎంటర్టైన్మెంట్ బేనర్ మీద మోహన్ బాబు, లక్ష్మిలే నిర్మించారు.