రాజాసాబ్ పరుగు.. మళ్లీ మొదలైంది

ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అయినప్పటికీ.. తన సినిమాల రేంజే వేరు అయినప్పటికీ.. చాలా వేగంగా సినిమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ప్రభాస్. అతను ఒకేసారి రాజాసాబ్, ఫౌజీ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ‘రాజాసాబ్’ విడుదలకు ఎంతో సమయం లేదు. డిసెంబరు 5కు ఈ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు సంక్రాంతి విడుదల అంటున్నారు. ఐతే పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజయ్యే ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, ప్రమోషన్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి.. కనీసం మూడు నెలల ముందే షూట్ పూర్తి చేయాలి. కానీ టాలీవుడ్లో కార్మికుల సమ్మె కారణంగా ఈ సినిమా షెడ్యూళ్లు దెబ్బ తిన్నాయి.

ఈ కోణంలో చూసినా డిసెంబరు రిలీజ్ కష్టమే అని భావించాలి. ఐతే రిలీజ్ ఎప్పుడు అన్నది ఇంకొన్ని రోజుల్లో తేలుతుంది కానీ.. ముందు షూటింగ్ విషయంలో టీం త్వరపడింది. ఇలా సమ్మె ఆగి షూటింగ్స్ పున:ప్రారంభం అయ్యాయో లేదో.. రాజాసాబ్ టీం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగేసింది. ప్రభాస్ కూడా వెంటనే కాల్ షీట్స్ ఇవ్వడంతో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టేశారు. అతను, ముఖ్య తారాగణం మీద కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

ఈ షెడ్యూల్ అయ్యాక పాటల చిత్రీకరణ ఉంటుందట. అందుకోసం విదేశాలకు వెళ్లనున్నారు. అటు ఇటుగా ఇంకో నెల రోజుల పాటు షూట్ ఉంటుందని తెలుస్తోంది. షూట్ పూర్తవడాన్ని బట్టి, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ మీద కూడా ఒక అంచనా వేసుకుని రిలీజ్ డేట్ ఫైనల్ చేస్తారు. సంక్రాంతి రిలీజ్ ఉండే అవకాశాలే ఎక్కువ. ఈ మేరకు క్లారిటీ వచ్చాకే అఖండ-2 చిత్రాన్ని డిసెంబరు 5కు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్’ లాంటి క్రేజీ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు, ప్రభాస్ చిత్రానికి మూడు రోజుల గ్యాప్ ఉండేలా చూసుకోనున్నట్లు తెలుస్తోంది.