ప్రస్తుతం ఇండియాలోనే టాప్ స్టార్లలో ఒకడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమాతో అతను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. అలాంటి హీరో సినిమాలో కీలక పాత్ర చేయమంటే ఏ నటి అయినా సంతోషంగా ఒప్పుకుంటుంది. కానీ మలయాళ నటి స్వశిక మాత్రం చరణ్ కొత్త చిత్రం పెద్ది కోసం అడిగితే నో చెప్పేసిందట. ఆ చిత్ర బృందం నుంచి తనను మళ్లీ మళ్లీ అడిగినా ఆ సినిమా చేయను అనేసిందట. ఇంత క్రేజీ ప్రాజెక్టులో నటించడానికి ఆమెకు వచ్చిన అభ్యంతరం ఏంటి అనిపించడం సహజం. ఐతే ఇందులో ఆమెకు ఆఫర్ చేసింది చరణ్ తల్లి పాత్ర అట.
స్వశిక వయసు ప్రస్తుతం 33 ఏళ్లే. రామ్ చరణ్‌కేమో 40 ఏళ్లు వచ్చేశాయి. స్వశిక తమిళ, మలయాళ భాషల్లో కొన్ని మిడిలేజ్డ్ పాత్రలు చేసిన మాట వాస్తవం. ఆమె ఎక్కువగా క్యారెక్టర్ రోల్సే చేస్తోంది. అంత మాత్రాన చరణ్ కంటే ఏడేళ్లు తక్కువ వయసున్న అమ్మాయిని తనకు తల్లిగా నటించమని అంటే ఫీలవ్వకుండా ఉంటుందా? తాను ఇప్పుడే ఆ తరహా పాత్రలు చేయాలనుకోవడం లేదని.. అందుకే ఆ సినిమాకు ఎన్నిసార్లు అడిగినా ఓకే చెప్పలేదని స్వశిక వెల్లడించింది.
స్వశిక 2009 నుంచి సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో వాగై అనే చిత్రంతో ఆమె కథానాయికగా పరిచయం అయింది. తర్వాత తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ ఎటు చూసినా నువ్వే అనే చిన్న సినిమాలో నటించింది స్వశిక. ఐతే ఈ మధ్య తమిళం, మలయాళంలో ఆమె చేసిన కొన్ని క్యారెక్టర్ రోల్స్ బాగా క్లిక్ అయ్యాయి. ముఖ్యంగా సూరి హీరోగా చేసిన మామన్ చిత్రంలో ఆమె చేసిన అక్క పాత్రకు చాలా పేరొచ్చింది.
అదే సమయంలో ఆమె తెలుగులోకి తమ్ముడు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అడవిలో ట్రక్కు నడిపే వెరైటీ పాత్రలో నటించింది స్వశిక. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో ఆమెకు తెలుగులో బ్రేక్ రాలేదు. చరణ్ సినిమాలో తల్లి పాత్ర చేస్తే మంచి పేరే వచ్చేదేమో కానీ.. అది తన వయసుకు తగ్గ పాత్ర కాకపోవడంతో నో చెప్పింది. ప్రస్తుతం తమిళంలో ఆమె సూర్య హీరోగా నటిస్తున్న కరుప్పు చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. తమిళం, మలయాళంలో ఆమె చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates