అర్జున్ చక్రవర్తి… ఈ ట్రైలరేదో బాగుందే

కొన్నిసార్లు చిన్న సినిమాల టీజర్లు, ట్రైలర్లు ఆశ్చర్యపరుస్తుంటాయి. పేరున్న నటీనటులు, టెక్నీషియన్లు లేకపోయినా.. ఔట్ పుట్ గొప్పగా అనిపించి ఈ సినిమా ఏదో బాగున్నట్లుందే అనే ఫీలింగ్ కలుగుతుంది. ‘అర్జున్ చక్రవర్తి’ అనే చిన్న సినిమా ట్రైలర్ ఇలాగే ఆశ్చర్యపరుస్తోంది. విజయ రామరాజు అనే అప్‌కమింగ్ ఆర్టిస్టును పెట్టి విక్రాంత్ రుద్ర అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది. శ్రీను గుబ్బాల ప్రొడ్యూసర్. చిన్న సినిమా అయినా బాగానే ఖర్చు పెట్టి, కొన్నేళ్ల పాటు శ్రమించి ఈ సినిమా తీసింది చిత్ర బృందం. ఇప్పటికే కొన్ని చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డులు, ప్రశంసలు అందుకున్న సినిమా ఇది. ఈ నెల 29న ‘అర్జున్ చక్రవర్తి’ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు.

ఒక కబడ్డీ క్రీడాకారుడి కథతో తెరకెక్కిన సినిమా ఇది. అనాథ అయిన ఒక కుర్రాడిని ఒక కబడ్డీ కోచ్ చేరదీసి అతణ్ని మేటి క్రీడాకారుడిగా తీర్చిదిద్దుతాడు. ఆటలో గొప్ప పేరు సంపాదించాక తన లాంటి ఛాంపియన్లను మరింత మందిని తయారు చేయడానికి అకాడమీ నెలకొల్పాలనుకుంటాడు అర్జున్. కానీ అతడి ప్రయత్నం ఫలించదు. మరోవైపు అతను ప్రేమించిన అమ్మాయి దూరమవుతుంది. దీంతో అతను తాగుడుకు బానిసై ఆటకు దూరమవుతాడు.

ఇక తన జీవితమే ముగిసిపోయిందనుకున్న దశలో తిరిగి ఆటలోకి వచ్చి మళ్లీ ఛాంపియన్ అనిపించుకోవడమే మిగతా కథ. తెలుగులో జెర్సీ, హిందీలో సుల్తాన్ లాంటి సినిమాలను గుర్తు చేసేలా సాగింది ఈ ట్రైలర్. తెలిసిన కథే అయినా.. సన్నివేశాలన్నీ ఇంటెన్స్‌గా ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో ఉండే క్వాలిటీ కనిపించింది. చాలా సిన్సియర్‌గా సినిమా తీశారనే ఫీలింగ్ కలిగించేలా ఉంది ట్రైలర్. హీరో ప్రాణం పెట్టి పని చేసినట్లున్నాడు. పాత్రకు తగ్గట్లుగా లుక్స్ మార్చుకోవడానికి పడ్డ కష్టం కనిపిస్తోంది. పెర్ఫామెన్స్ కూడా బాగుంది. మరి ట్రైలర్ లాగే సినిమా కూడా మెప్పించి టీం పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుందేమో చూడాలి.