లోకేష్ కనకరాజ్.. ఇక గిమ్మిక్కులు పని చేయవు

గత దశాబ్ద కాలంలో ఇండియన్ సినిమాలో చాలా తక్కువ సమయంలో ఎక్కడ లేని క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడంటే లోకేష్ కనకరాజ్ అనే చెప్పాలి. అతను ఇప్పటిదాకా తీసిన సినిమాలు అరడజనే. తన తొలి చిత్రం ‘మానగరం’ ఓ మోస్తరుగా ఆడగా.. ఖైదీ, విక్రమ్ సినిమాలు బ్లాక్‌బస్టర్లు అయ్యాయి. మిగతా మూడు చిత్రాలూ నిరాశకు గురి చేశాయి. కానీ తనకు ప్రేక్షకుల్లో వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ‘విక్రమ్’ సినిమాలో అతను పరిచయం చేసిన ‘లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్’ (ఎల్సీయూ) కాన్సెప్ట్ జనాలను వెర్రెత్తించేసింది. తన చివరి సినిమా ‘లియో’కు, కొత్త చిత్రం ‘కూలీ’కి మామూలు హైప్ రాలేదు. కానీ ఈ రెండు చిత్రాలూ ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేశాయి.

లోకేష్ తనపై పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయాడు. ప్రోమోలతో ఏదో భ్రమింపజేసి.. చివరికి సినిమాలో తుస్సుమనిపించేశాడు. ‘కూలీ’ చూశాక లోకేష్ మీద ప్రేక్షకులకు నమ్మకం బాగా సడలిపోయింది. తాము మోసపోయిన ఫీలింగ్ కలిగింది ఈ సినిమా చూస్తున్నపుడు.

ఏ దర్శకుడైనా గిమ్మిక్కులు చేసి ఒకట్రెండుసార్లు మాత్రమే ప్రేక్షకులను మభ్యపెట్టగలడు. ఎక్కువసార్లు విషయం లేకుండా హడావుడి చేస్తే ప్రేక్షకులకు చిర్రెత్తుకొస్తుంది. రామ్ గోపాల్ వర్మ ఇలా చాలాసార్లు చేసి, తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు ఆయన మంచి సినిమా చూసినా థియేటర్లకు వచ్చి జనం చూసే పరిస్థితి లేదు. లోకేష్‌ను మరీ వర్మతో పోల్చలేం కానీ.. అతడికి ‘కూలీ’తో డేంజర్ బెల్స్ మోగినట్లే.

ఈసారి కేవలం ప్రోమోలతో హైప్ తీసుకురావడం.. లాజిక్ లేకుండా సినిమాలు మెప్పించడం సాధ్యం కాదు. ‘కూలీ’ తర్వాత అతను ముందు ‘ఖైదీ-2’ తీయాలనుకున్నాడు. ఆ సినిమానే తీస్తే కథ వేరుగా ఉండేది. కానీ రజినీ, కమల్ కలయికలో మల్టీస్టారర్ అంటున్నాడు. ‘కూలీ’ లాగే కాంబినేషన్ క్రేజ్‌తో ప్రేక్షకులను వెర్రి వాళ్లను చేయాలనుకుంటే లోకేష్‌ షాక్ తినక తప్పదు. ఈసారి గిమ్మిక్కులన్నీ వదిలేసి.. ఖైదీ, విక్రమ్ లాగా బలమైన కథతో సినిమా తీస్తేనే ప్రేక్షకుల నుంచి ఆమోదం లభిస్తుంది.