ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీల మధ్య ఎంత అంతరం చెరిగిపోయినా సరే.. ఓ భారతీయ నటుడికి హాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కడం గొప్ప విషయమే. అలాంటి అరుదైన ఛాన్స్ తన చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిందని అంటున్నాడు మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్. మలయాళంలో చిన్న సినిమాలతో మొదలుపెట్టి.. చాలా పెద్ద రేంజికి ఎదిగిపోయాడు ఫాహద్. విక్రమ్, పుష్ప-2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో అతను తిరుగులేని పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్లలో ఒకడైన ఫాహద్‌కు హాలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చిందట.
కానీ తనకు ఇంగ్లిష్ సరిగా రాకపోవడం వల్ల ఆ ఛాన్స్ మిస్ అయినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఫాహద్ షాకింగ్ విషయం వెల్లడించాడు. అకాడమీ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అలెజాండ్రో గొంజాలెజ్ ఇనారిటు ఫాహద్‌కు తన సినిమాలో ఒక రోల్ ఆఫర్ చేశాడట. ది రివెనెంట్, బర్డ్ మ్యాన్ లాంటి భారీ చిత్రాలు రూపొందించిన దర్శకుడాయన. తన సినిమాలో నటిస్తావా అంటూ ఇనారిటునే స్వయంగా తనకు కాల్ చేసి అడిగాడని.. కానీ తాను ఆయనతో మాట్లాడిన విధానంతో ఆయన సంతృప్తి చెందలేదని.. తన ఇంగ్లిష్ యాక్సెంట్ ఆయనకు నచ్చలేదని ఫాహద్ తెలిపాడు.
భాషలో మెరుగులు దిద్దుకునేందుకు మూడు నెలల పాటు అమెరికాకు వెళ్లి అక్కడే ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని.. ఆ విషయం తనే వాళ్లకు చెప్పానని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే తాను అమెరికాకు వెళ్లి ఇంగ్లిష్ యాక్సెంట్‌పై పట్టు సాధించి ఆ సినిమాలో నటించేవాడినని.. కానీ వాళ్లే ఆసక్తి చూపించలేదని ఫాహద్ తెలిపాడు. ఐతే కమర్షియల్ కోణంలో చూస్తే ఆ పాత్రకు తాను సరిపోనని.. ఆ రోల్ పోయిందని తనకు చింత ఏమీ లేదని.. తనకు గుర్తింపు ఇచ్చిన మలయాళంలో సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉంటానని ఫాహద్ అన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates