ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు మురుగదాస్. రమణ (ఠాగూర్ ఒరిజినల్), గజిని, తుపాకి, కత్తి చిత్రాలతో అతను భారీ విజయాలందుకున్నాడు. ‘గజిని’ని హిందీలో అతనే రీమేక్ చేస్తే అది అప్పటి బాలీవుడ్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఎంతో ఆసక్తితో మురుగదాస్ దర్శకత్వంలో సినిమాలు చేశారు. ఐతే మురుగదాస్ చిరుతో చేసిన ‘స్టాలిన్’ మోస్తరుగా ఆడగా.. మహేష్‌తో తీసిన ‘స్పైడర్’ డిజాస్టర్ అయింది.
‘స్పైడర్’ తర్వాత మురుగదాస్‌కు ఏ సినిమా కలిసి రాలేదు. సర్కార్, దర్బార్, సికందర్.. ఇలా ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అయ్యాయి. ‘సికందర్’ చూశాక మురుగదాస్ పూర్తిగా టచ్ కోల్పోయాడనిపించింది. ఇప్పుడు శివకార్తికేయన్ సినిమా ‘మదరాసి’తో పుంజుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మురుగదాస్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫెయిల్యూర్లకు కారణమేంటో వివరించాడు.
సూర్యతో చేసిన ‘సెవన్త్ సెన్స్’ తర్వాత తాను ‘తుపాకి’ కథ రాశానని.. కానీ ఆ స్క్రిప్టు పూర్తి కాకముందే సినిమా మొదలుపెట్టేశానని మురుగదాస్ తెలిపాడు. విజయ్‌కి తాను చెప్పిన కొన్ని ఎపిసోడ్లు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని.. దీంతో స్క్రిప్టు పూర్తి కాకముందే సినిమాను మొదలుపెట్టేశామని.. అది బ్లాక్ బస్టర్ అయిందని మురుగదాస్ చెప్పాడు. విజయ్‌తో ఆ తర్వాత తీసిన ‘కత్తి’ విషయంలో కూడా ఇదే జరిగిందని.. దీంతో సినిమా అనే ఆర్ట్‌లో తాను మాస్టర్ అయిపోయాననే ఫీలింగ్ తనకు వచ్చేసిందని మురుగదాస్ తెలిపాడు.
కానీ ఇలా పూర్తి స్క్రిప్టులు సిద్ధం కాకుండానే సినిమాలు చేయడం తప్పని.. అది తన తర్వాతి చిత్రాలపై ప్రభావం చూపిందని.. అదే తన ఫెయిల్యూర్లకు కారణమైందని తెలిపాడు మురుగదాస్. సల్మాన్ ఖాన్‌తో చేసిన ‘సికందర్’ విషయంలో తన కంట్రోల్ పూర్తిగా లేదని మురుగదాస్ తెలిపాడు. ‘మదరాసి’ మాత్రం తనకు మంచి బ్రేక్ ఇస్తుందని అతనన్నాడు. ‘తుపాకి’ సినిమాకు సీక్వెల్ చేయడానికి స్కోప్ ఉందని.. క్లైమాక్స్‌లో హీరో తిరిగి బోర్డర్‌కు వెళ్లడం చూపిస్తామని.. తర్వాత తన జీవితంలో ఏం జరుగుతుందన్నది పార్ట్-2గా తీయొచ్చని.. కుదిరితే ఆ సినిమా చేస్తానని మురుగదాస్ తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates