రవితేజ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు

మాస్ జాతర వాయిదా గురించి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఫిలిం నగర్ వర్గాల ప్రచారం వల్ల ఇది కన్ఫర్మ్ అని ఫ్యాన్స్ కి అర్థమైపోయింది. చేతిలో ఉన్న పది రోజుల్లో ప్రమోషన్లు, సెన్సార్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ వగైరాలు జరిగే పని కాదని ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. వార్ 2 డిస్ట్రిబ్యూట్ చేసిన నాగవంశీనే మాస్ జాతరకు నిర్మాత కావడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. కింగ్డమ్ తో పాటు భారీ పెట్టుబడి పెట్టిన వార్ 2 ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం ఆర్థికంగానూ ప్రభావం చూపించనుంది. ఈ పరిణామాలన్నీ రవితేజ అభిమానులను బాధ పెడుతున్నాయి.

ఎందుకంటే తమ హీరో నుంచి గత అయిదేళ్ల కాలంలో వచ్చిన సాలిడ్ బ్లాక్ బస్టర్లు రెండే. అవి క్రాక్, ధమాకా. మిగిలినవన్నీ నిర్మాతలకు తీవ్ర నష్టాలు తెచ్చి పెట్టిన ఫెయిల్యూర్స్. ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర లాంటి ప్రయోగాలన్నీ చేదు అనుభవాలు మిగిల్చాయి. వాల్తేరు వీరయ్య రూపంలో ఒక హిట్టు ఉన్నప్పటికీ అది ప్రత్యేక పాత్ర కావడంతో కౌంట్ లోకి వేసుకోవడం లేదు. సోలోగా ఒక పెద్ద సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ మాస్ జాతరకు పరిస్థితులు సానుకూలంగా లేవు. ఇప్పటికే రెండు మూడు వాయిదాలు పడ్డాయి. లిరికల్ సాంగ్ లో బూతులు ఎక్కువున్నాయని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.

పోనీ టీజర్ ఎక్స్ ట్రాడినరిగా ఉందా అంటే అదీ జరగలేదు. రొటీన్ గా అనిపించిందంటూ అధిక శాతం పెదవి విరిచారు. ఇప్పుడీ పోస్ట్ పోన్ వార్త ఇంకో షాక్. వేగంగా సినిమాలు చేయడంలో రవితేజ అందరికంటే ముందు ఉన్నప్పటికీ సక్సెస్ రేషియో లో మాత్రం వెనుకబడి ఉండటం సగటు మూవీ లవర్స్ కి మింగుడు పడటం లేదు. ఒకవేళ ఆగస్ట్ 27 మాస్ జాతర రావడం లేదనుకుంటే కొత్త డేట్ ఏంటనేది ఇంకో సస్పెన్స్. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ దాకా అన్నీ ప్యాక్ అయ్యి ఉన్నాయి. నవంబర్ అన్ సీజన్. మరి ఎక్కడ స్లాట్ దక్కించుకుంటారో చూడాలి. అది తేలేదాకా ఫ్యాన్స్ మనసులు కుదుటపడవు.