రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజవుతుంటే.. ఆయా యూనిట్ సభ్యుల మధ్య పోటీతత్వం ఉంటుంది. అవతలి చిత్రానికి, అందులో భాగమైన వారికి ఎలివేషన్ ఇవ్వడం, ఆల్ ద బెస్ట్ చెప్పడం అందరూ చేయరు. చేసినా ఏదో మొక్కుబడిగానే ఉంటుందంతే. ఐతే బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్.. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. హృతిక్ నటించిన ‘వార్-2’.. రజినీ సినిమా ‘కూలీ’తో గురువారం బాక్సాఫీస్ దగ్గర బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో రజినీ మీద తన గౌరవభావాన్ని చాటుతూ హృతిక్ ‘ఎక్స్’లో పోస్టు పెట్టాడు.
రజినీని తన తొలి టీచర్లలో ఒకడిగా హృతిక్ అభివర్ణించడం విశేషం. ‘‘మీ పక్కనే ఉండి నటుడిగా తొలి అడుగులు వేశాను. రజినీ సార్.. నా తొలి గురువుల్లో మీరు ఒకరు. ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతూ ఇప్పటికీ మాకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉన్నారు. ఆన్ స్క్రీన్ మ్యాజిక్ చేస్తూ 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న మీకు శుభకాంక్షలు’’ అని హృతిక్ పేర్కొన్నాడు. హృతిక్ చిన్న పిల్లాడిగా ఉండగా.. ఆయన తండ్రి రాకేష్ రోషన్, తాత రోషన్ కలిసి నిర్మించిన బాలీవుడ్ మూవీ ‘భగవాన్ దాదా’లో రజినీకాంత్‌తో కలిసి నటించడం విశేషం.
అప్పటి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. ఈ ఫొటోల గురించి ఇటీవల ఓ ఆ కార్యక్రమంలో ప్రస్తావిస్తే హృతిక్ ఎంతో ఎగ్జైట్ అయ్యాడు. అప్పుడు రజినీ ఎంత పెద్ద సూపర్ స్టారో తెలియక, అంకుల్ అంకుల్ అంటూ చాలా క్యాజువల్‌గా మాట్లాడేవాడినని.. ఇప్పుడు ఆయనతో కలిసి నటిస్తే భిన్నంగా ప్రవర్తిస్తానని హృతిక్ చెప్పాడు. తాను ఆ సినిమా షూటింగ్ టైంలో తప్పులు చేసి, మళ్లీ టేక్ తీసుకున్నా.. తప్పు తన మీద వేసుకుని, తానే సరిగా చేయలేదన్నట్లుగా రజినీ చెప్పేవాడని హృతిక్ గుర్తు చేసుకున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates