కారు వివాదం.. స్పందించిన నిధి అగ‌ర్వాల్

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు క‌థానాయిక నిధి అగ‌ర్వాల్ తాజాగా ఒక అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఇటీవ‌ల భీమ‌వ‌రంలో ఒక స్టోర్ ప్రారంభోత్స‌వానికి వెళ్లిన సంద‌ర్భంగా ఆమె ప్ర‌భుత్వ వాహ‌నంలో ప్ర‌యాణిస్తూ క‌నిపించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ వీడియో ఈ రోజు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇది అధికార దుర్వినియోగం కాదా.. ప‌న‌వ్ క‌ళ్యాణ్ ప‌క్క‌న క‌థానాయిక‌గా న‌టిస్తే.. ప్ర‌భుత్వ వాహ‌నంలో తిర‌గ‌నిస్తారా అంటూ సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. ముఖ్యంగా వైసీపీ వాళ్ల‌కు ఈ వీడియో ఆయుధంగా మారింది. ఈ వీడియో వైర‌ల్ అయిన నేప‌థ్యంలో నిధి అగ‌ర్వాల్ స్పందించింది.

తన పేరుతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. త‌న‌కు ప్ర‌భుత్వం ఈ వాహ‌నం స‌మ‌కూర్చ‌లేద‌ని.. ఈవెంట్ నిర్వాహ‌కులే ఆ వాహ‌నం ఇచ్చి పంపార‌ని ఆమె వెల్ల‌డించింది. దీనికి ప్ర‌భుత్వానికి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది.
‘ఇటీవల భీమవరంలో ఓ స్టోర్‌ ప్రారంభోత్సవానికి వెళ్లిన‌ సందర్భంగా జరిగిన పరిణామాలపై సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఈ విషయంలో నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈవెంట్‌ నిర్వాహకులు నా కోసం ఏర్పాటు చేసిన వాహనం ఆంధ్రప్రదేశ్‌ ప్ఘ్రభుత్వానిది.

అందులో నా పాత్ర ఏమీ లేదు. ప్రభుత్వ అధికారులే నా కోసం వాహనాన్ని పంపినట్లు రాస్తున్నారు. అవి నిరాధారమైన వార్త‌లు. ఈ విషయంలో నాకెలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ అధికారులెవరూ నాకు ఎలాంటి వాహనం పంపలేదు. నా అభిమానులకు వాస్తవాలను చెప్పడం నా బాధ్యత. ప్రతి విషయంలోనూ ప్రేమ, సహకారం అందిస్తున్న అభిమానుల‌కు థ్యాంక్స్‌’’ అని నిధి స్ప‌ష్టం చేసింది. ఐతే ప్ర‌భుత్వ అధికారులు పంప‌క‌పోయినా.. వాహనం అయిదే గ‌వ‌ర్న‌మెంట్‌దే కావ‌డంతో ఈ విష‌యంలో విమ‌ర్శ‌లు త‌ప్ప‌ట్లేదు. మ‌రి ఆ కారు ఏ డిపార్ట్‌మెంట్‌ది, ప్రైవేటు కార్య‌క్ర‌మానికి దాన్ని ఎలా ఉప‌యోగించారు అన్న‌ది తెలియాల్సి ఉంది. పూర్తి వివ‌రాల కోసం ఎదురు చూడాల్సిందే.