ఫ్యాన్ వార్స్‌కు చెక్ పెట్టిన ఎన్టీఆర్

తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అనుకోవడం ఒక లెక్క. అవతలి హీరోలను కించపరచడమే పనిగా పెట్టుకోవడం ఇంకో లెక్క. సోషల్ మీడియా పుణ్యమా అని వీరాభిమానుల్లో చాలామంది రెండో పనికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇద్దరు హీరోలు కలిసి ఓ సినిమా చేస్తే.. అవతలి హీరోను డీగ్రేడ్ చేయడమే ధ్యేయంగా పని చేస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎవరు హైలైట్ అయ్యారు.. ఎవరు మెయిన్ హీరో అనే విషయంలో ఏళ్ల తరబడి కొట్టుకుంటూనే ఉన్నారు. అది చాలదని తారక్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘వార్-2’ సినిమా విషయంలో కూడా ఇదే రచ్చ కొనసాగుతూ ఉంది.

ఇక్కడ తారక్, హృతిక్ ఫ్యాన్స్ గొడవ పడినా ఒక అర్థం ఉందనుకోవచ్చు. కానీ తారక్ యాంటీ ఫ్యాన్స్ హృతిక్‌ను లేపుతూ, తారక్‌ను కించపరిచే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. వారితో తారక్ ఫ్యాన్స్‌కు గొడవ పడుతున్నారు. ఐతే ఈ అనవసర ఫ్యాన్ వార్స్‌ తారక్ దృష్టికి కూడా వచ్చాయేమో.. ‘వార్-2’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ అంశం మీద మాట్లాడాడు.

‘వార్-2’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన డ్యాన్స్ నంబర్లో ఎవరు హైలైట్ అయ్యారు అనే విషయంలో వాదనలు నడుస్తుండగా.. తారక్ వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ పాటలో ఎవరు బాగా డ్యాన్స్ చేశారు అనే చర్చ అనవసరమని.. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చ అభిమానులను తప్పుదోవ పట్టించేదని తారక్ అన్నాడు. ఈ పాట ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్స్ కలిసి చేసిన సాంగ్ అని.. దాన్ని ఎంజాయ్ చేయాలని.. వాదనలు అనవసరమని తారక్ స్పష్టం చేశాడు.

అంతే కాదు.. హృతిక్‌కు అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చి తన ఫ్యాన్స్ కూడా అతి చేయకుండా బ్రేక్ వేయాలని చూశాడు తారక్. హృతిక్ ఇండియాలోనే గ్రేటెస్ట్ డ్యాన్సర్ అంటూ ట్యాగ్ ఇచ్చాడు తారక్. మైకేల్ జాక్సన్ తర్వాత ఎవరి డ్యాన్స్ తనకు ఆనేది కాదని.. కానీ హృతిక్ డ్యాన్స్ చూసి అబ్బుర పడ్డానని.. తన నుంచి ఇన్‌స్పైర్ అయ్యానని తారక్ చెప్పాడు. అంతే కాక ‘వార్-2’ సినిమాతో తాను హిందీ పరిశ్రమలోకి ప్రవేశించడం కాదని.. హృతిక్ టాలీవుడ్లోకి వస్తున్నాడని.. అతడి మీద అమితమైన ప్రేమ కనబరుస్తామని, గుండెల్లో పెట్టుకుంటామని అభిమానుల తరఫున తాను హామీ ఇస్తున్నానని తారక్ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.