టాక్ అఫ్ ది ఫ్యాన్స్…. నాని ‘జడల్’

దసరా కాంబోని రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ నుంచి ఒకటి కాదు ఏకంగా రెండు ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయడం ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తింది. రెండు జెడలను ముందుకు వేలాడదీసుకుని ఊర మాస్ వెరైటీ లుక్ తో ఓదెల చూపించిన శాంపిల్ అభిమానులకు ఓ రేంజ్ కిక్ ఇచ్చింది. ఇప్పుడిదే వాళ్ళ మధ్య హాట్ టాపిక్ అయ్యింది. మార్చి 26 విడుదల కాబోతున్న ప్యారడైజ్ లో నానికి ఇప్పటిదాకా ఏ టాలీవుడ్ హీరో చేయని క్యారెక్టరైజేషన్ ఉంటుందని ఇప్పటికే ఇన్ సైడ్ టాక్. అది రివీల్ అయ్యాక ఆడియన్స్ షాక్ తినడం ఖాయమని అంటున్నారు.

కేవలం ఒక్క రోజు గ్యాప్ తో రామ్ చరణ్ పెద్దితో క్లాష్ ఉన్న కారణంగా ప్యారడైజ్ కు పెద్ద సవాలే ఎదురు కానుంది. దానికి ధీటైన కంటెంట్ ఇందులో ఉందని ప్రమోషన్ల ద్వారా చూపించగలిగితేనే బిజినెస్, హైప్ పరంగా కాంపిటీషన్ ఇవ్వొచ్చు. ఇది దృష్టిలో ఉంచుకునే శ్రీకాంత్ ఓదెల ఇప్పటి నుంచే పబ్లిసిటీ స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగానే రెగ్యులర్ ట్రెండ్ కి భిన్నంగా రెండు లుక్స్ వదిలాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఆడియన్స్ ని ముందు నుంచే ప్రిపేర్ చేయడం లాంటిది. అంచనాలను పక్కదారి పట్టించకుండా సినిమా ఎలా ఉండబోతోందనే క్లూస్ ఇవ్వడం బజ్ పరంగా తెలివైన ఆలోచన.

ఆగస్ట్ మినహాయిస్తే చేతిలో ఉన్నది కేవలం ఆరు నెలలే. పెద్దితో సమాంతరంగా పనులు వేగవంతం చేసుకుంటేనే డెడ్ లైన్ మీట్ అవుతుంది. కాకతాళీయంగా రెండు సినిమాల దర్శకులకు ఇది ద్వితీయ ప్రయత్నం కావడం గమనార్హం. ఉప్పెనతో బుచ్చిబాబు, దసరాతో శ్రీకాంత్ ఓదెల ఇద్దరూ ఘనంగా కెరీర్ ప్రారంభించిన వాళ్ళే. రెండో ప్రయత్నంలోనే పెద్ద హీరోలను ఒప్పించగలిగారు. యాదృచ్చికంగా ఇప్పుడు ఎంచుకున్న కథలు, నేపథ్యం, వాతావరణం షాకింగ్ గా ఉన్నాయి. అక్టోబర్ నుంచి రెండు యూనిట్లు క్రమం తప్పకుండా ఎగ్జైటింగ్ అప్డేట్స్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.