కృష్ణ అల్లుడు, మహేష్ బాబు బావ అనే గుర్తింపుతోనే కొన్నేళ్లు కెరీర్‌ను నడిపించాడు సుధీర్ బాబు. మొదట్లో అతను చేసిన సినిమాల్లో నటనకు సంబంధించి విమర్శలూ ఎదుర్కొన్నాడు. కానీ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ దగ్గర్నుంచి నటుడిగా తెచ్చుకున్న పేరుతో తన ఇమేజ్ మారింది. సమ్మోహనం, నన్ను దోచుకుందువటే చిత్రాలతో తన కెరీర్లో ఇంకా మంచి మార్పు వచ్చింది. ఐతే ఈ మధ్య మంచి సినిమాలే చేస్తున్నా అతను కోరుకున్న కమర్షియల్ సక్సెస్ మాత్రం రావట్లేదు.
హరోం హర, మా నాన్న సూపర్ హీరో చిత్రాల్లో సుధీర్ బాబు పెర్ఫామెన్స్ అదిరిపోయినా అవి అతను ఆశించిన విజయాలు మాత్రం సాధించలేదు. ఈసారి సుధీర్ బాబు ట్రెండుకు తగ్గ సినిమాతో వస్తున్నాడు. అదే.. జటాధర. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైశ్వాల్ అనే ఇద్దరు దర్శకులు కలిసి తీస్తున్న సినిమా ఇది. సుధీర్ బాబు గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా దీని మీద భారీ బడ్జెట్టే పెడుతున్నట్లున్నారు. ఆరుగురు నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్ సినిమాపై అంచనాలను పెంచే విధంగానే ఉంది.
దేవుడు వెర్సస్ దుష్టశక్తి మధ్య పోరు అన్నది దశాబ్దాల నుంచి విజయవంతంగా నడుస్తున్న పాయింట్. ప్రస్తుతం డివైన్ ఎలిమెంట్స్ జోడిస్తే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. అందుకు తాజా ఉదాహరణ.. మహావతార నరసింహ. ఈ ట్రెండును అందిపుచ్చుకుంటూ ‘జటాధర’లోనూ దైవ కృప ఉన్న కుర్రాడు.. దుష్టశక్తి ఆవహించిన అమ్మాయి మధ్య పోరు నేపథ్యంలో సినిమాను నడిపించినట్లు కనిపిస్తోంది. ఈ కాన్సెప్ట్‌కు తోడు భారీగా వీఎఫెక్స్‌తో ముడిపడ్డ షాట్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.
సోనాక్షి సిన్హాను ప్రధాన పాత్రకు తీసుకోవడం ఉత్తరాది ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునే అన్నది స్పష్టం. సుధీర్ బాబు సైతం ‘వర్షం’ హిందీ రీమేక్ ‘భాగి’లో నటించి అక్కడ గుర్తింపు సంపాదించాడు. అతడి హిందీ అనువాద చిత్రాలు కూడా ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకర్షించే కాన్సెప్ట్, అక్కడి హీరోయిన్ని పెట్టుకుని పెద్ద ప్లానింగ్‌తోనే రంగంలోకి దిగినట్లున్నాడు సుధీర్ బాబు. ఈ సినిమా అక్కడి వాళ్లకు కనెక్టయితే ‘కార్తికేయ-2’ తరహాలో ఉత్తరాదిన బాగా ఆడితే ఆశ్చర్యం లేదు. దాంతో పాటుగా తెలుగు ప్రేక్షకులూ ఆదరిస్తే సుధీర్ బాబు ఖాతాలో మంచి హిట్ జమ అవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates