చిరు వల్లే కొడుకు ప్రాణం నిలిచిందని…

మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన బ్లడ్ బ్యాంక్ వల్ల ఎన్ని ప్రాణాలు నిలబడ్డాయో లెక్క లేదు. దేశంలో రెడ్ క్రాస్ లాంటి సంస్థలు ఎప్పట్నుంచో ఈ సేవలో నిమగ్నమై ఉన్నప్పటికీ.. చిరు అంత బాగా రక్తదానాన్ని ప్రమోట్ చేసి, జనాల్లో అవగాహన పెంచి, దీన్నో ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మరొకరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వల్ల నిలిచిన ప్రతి ప్రాణం గురించి వార్తల్లో రాకపోవచ్చు. కానీ బయటికి తెలియని మానవీయ కథనాలు ఎన్నో ఉండుంటాయి. అలాంటి ఒక స్టోరీని హైదరాబాద్‌లో బుధవారం జరిగిన ‘మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్’ కార్యక్రమంలో చిరంజీవి పంచుకున్నారు.

తనను ఎంతోమంది ఎన్నో మాటలు అంటుంటారని.. సోషల్ మీడియాలో కూడా విమర్శలు చేస్తుంటారని.. కానీ వాటికి తాను స్పందించనని.. తాను చేసే మంచే తనను రక్షణ కవచంగా కాపాడుతుంది అంటూ ఒక ఉదాహరణ చెప్పుకొచ్చారు చిరంజీవి. ‘‘ఆ మధ్య ఒక రాజకీయ నాయకుడు నా గురించి అవాకులు చెవాకులు పేలారు. అకారణంగా మాటలు అన్నారు. నేను రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నా సరే.. నన్ను ఎందుకు అంతలా ఎందుకు విమర్శించారో తెలియదు. ఐతే ఆ తర్వాత ఆ నాయకుడు ఒక ముంపు ప్రాంతానికి వెళ్తే ఒక మహిళ ఆయన్ని పట్టుకుని చెడామడా తిట్టేశారు.

చిరంజీవిని అనడానికి నీకెలా మనసొచ్చింది అంటూ ఆమె ఆ నాయకుడిని కడిగేశారు. నడి వయస్కురాలైన ఆమెను చూస్తే మాస్ ఫ్యాన్ లాగా అనిపించలేదు. ఆశ్చర్యంగా అనిపించి ఆమె వివరాలేంటో తెలుసకోమని ఒక జర్నలిస్ట్ సోదరుడిని చెప్పి పంపించాను. అప్పుడామె వీడియోలో అసలు విషయం చెప్పారు. తన కొడుక్కి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే.. సమయానికి రక్తం దొరక్క ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందట.

ఇంకో గంటలో రక్తం కావాల్సిన పరిస్థితుల్లో ఎవరో చెబితే హైదరాబాద్‌లో ఉండే చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు కాల్ చేస్తే.. వాళ్లు అత్యవసరంగా రాజమండ్రిలో ఉన్న అభిమానులను పంపించి సమయానికి రక్తం అందేలా చేసి తన కొడుకును కాపాడారంటూ ఆమె వెల్లడించారు. ఇలాంటి వ్యక్తినా మీరు విమర్శిస్తారు అంటూ కోపంతో తాను ఆ రాజకీయ నాయకుడితో గొడవ పడినట్లు ఆమె చెప్పుకొచ్చారు. నేను ఎవరైనా విమర్శిస్తే ఎందుకు స్పందించనంటే ఇదే కారణం. నేను చేసే మంచే నాకు రక్షణ కవచం అనుకుంటాను. ఇలాంటి వాళ్లే నాకు అండగా నిలుస్తారు’’ అని చిరు వివరించారు.