హరిహర వీరమల్లు విడుదల ముందు వరకు చాలా మందిలో ఉన్న సందేహం ఒక్కటే. ఇంత పెద్ద గ్రాండియర్ కు ఎంఎం కీరవాణి ఎంతవరకు న్యాయం చేయగలరని. ఆ అనుమానానికి తగ్గట్టే ఆడియో మరీ గొప్పగా చెప్పుకునే ఛార్ట్ బస్టర్ కాలేదు. సాంగ్స్ బాగున్నాయనే పేరొచ్చింది కానీ గ్రేట్ ఆల్బమ్ అవ్వలేదు. రెండు పాటలు జనాలకు ఫాస్ట్ గా రీచయ్యాయి. నిజానికి ఆస్కార్ విజేత మీద ఎలాంటి డౌట్స్ పెట్టుకోకూడదు. కానీ రాజమౌళికి తప్ప తన బెస్ట్ ని ఇతరులకు ఇవ్వడం లేదనే కామెంట్స్ కీరవాణి మీద కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి. అందుకే హరిహర వీరమల్లు మీద డిస్కషన్ నడిచింది.
అవన్నీ సినిమా చూశాక పటాపంచలు అయ్యాయి. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కీరవాణి చాలా ఎపిసోడ్స్ ని నిలబెట్టేశారు. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ లో ఫ్యాన్స్ దీన్ని బాగా ఆస్వాదించారు. సినిమా ఫలితం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడే చెప్పలేం కానీ తనవరకు పెద్దాయన న్యాయం చేకూర్చారు. విజువల్ గా చూశాక పాటలు కూడా కనెక్ట్ అవుతున్నాయి. ఈవెంట్లలో పవన్ కళ్యాణ్, జ్యోతి కృష్ణ, ఏఎం రత్నం ఇచ్చిన ఎలివేషన్లకు తగ్గట్టుగానే తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని గెలిచారు కీరవాణి. పవన్ కళ్యాణ్ తో తన మొదటి మూవీ బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ కాకుండా చూసుకున్నారు.
ఇప్పుడు నెక్స్ట్ మజిలీ విశ్వంభర కానుంది. కీరవాణికి అది ఇంకా పెద్ద బాధ్యత. ఎందుకంటే బడ్జెట్ పరంగా అది ఇంకా గ్రాండ్ స్కేల్ లో రూపొందింది. మెగాస్టార్ కు గతంలో ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు, ఎస్పి పరశురామ్ సినిమాలకు వర్క్ చేసిన కీరవాణి మూడు దశాబ్దాల తర్వాత మళ్ళీ చిరంజీవితో చేతులు కలిపారు. ఆల్రెడీ వచ్చిన రామనవమి పాట పర్వాలేదనిపించుకుంది. ఒక స్పెషల్ సాంగ్ ని భీమ్స్ తో చేయించుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టి విశ్వంభర బీజీఎమ్ వైపు వెళ్లనుంది. దీనికి ఎలా ఇస్తారో చూడాలి. అసలైన ఛాలెంజ్ మహేష్ బాబు – రాజమౌళి ప్యాన్ ఇండియా మూవీతో ఎదురుకానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates