1989లో రిలీజైన బాలీవుడ్ మూవీ మైనే ప్యార్ కియా అప్పట్లో ఒక సంచలనం. సల్మాన్ ఖాన్ ని ఓవర్ నైట్ స్టార్ చేసిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇది. దేశం మొత్తం ఈ సినిమా పాటలు వినిపించని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. కబూతర్ జాజా, ఆజా శామ్ హోనే ఆయీ, మేరే రంగ్ మే క్లాసు మాస్ తేడా లేకుండా వాడవాడలా హోరెత్తిపోయాయి. హీరోయిన్ భాగ్యశ్రీ కుర్రకారుకి ఆరాధ్య దేవతగా మారిపోయింది. నష్టాల్లో ఉన్న రాజశ్రీ సంస్థ ఒక్కసారిగా కోట్ల రూపాయల కనకవర్షంలో తడిసిపోయింది. కమర్షియల్ మూసలో ఉన్న హిందీ ఇండస్ట్రీకి కొత్త రొమాంటిక్ జానర్ పరిచయం చేసిన ఘనత దర్శకుడు సూరజ్ ఆర్ బరజాత్యకు చెందుతుంది.
అలాంటి ఐకానిక్ మూవీకి సీక్వెల్ ప్లానింగ్ జరుగుతోందని ముంబై రిపోర్ట్. మైనే ప్యార్ కియా ఫిర్ సే టైటిల్ తో సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ హీరోగా తీసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయట. ఇది విన్న మూవీ లవర్స్ గుండెలు అదురుతున్నాయి. ఎందుకంటే అర్బాజ్ వయసు ఇప్పుడు 57 సంవత్సరాలు. ఇలాంటి టైంలో ప్రేమకథలో ఆయన్ను చూడలేం. ఒకవేళ ఏజ్ బార్ లవర్ పాత్ర పోషిద్దాం అనుకున్నా కూడా మైనే ప్యార్ కియాకున్న వింటేజ్ వైబ్ ని చంపేసినట్టు అవుతుంది. అర్బాజ్ మనకు కూడా పరిచయమే. మెగాస్టార్ జై చిరంజీవలో మెయిన్ విలన్ గా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు.
ఇప్పటికైతే అధికారికంగా ప్రకటన రాలేదు కానీ ఇది గాసిప్ దగ్గరే ఆగిపోతే బాగుంటుంది. సల్మాన్ ఖాన్ 2005లో మైనే ప్యార్ క్యూ కియా అనే సినిమా చేశాడు. ఓ మాదిరిగా ఆడింది కానీ మరీ బ్లాక్ బస్టర్ కాలేదు. కాకపోతే దీన్ని సీక్వెల్ గా ప్రమోట్ చేయలేదు. కేవలం టైటిల్ క్రేజ్ ని వాడుకున్నారు. కానీ అర్బాజ్ మాత్రం కొనసాగింపు చేద్దామని అంటున్నాడట. మరి దీనికి సూరజ్ బరజాత్య, రాజశ్రీ సంస్థ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అడిగితే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. కాకపోతే చిన్న మెలికతో వివాదం లేకుండా మైనే ప్యార్ కియా ఫిర్ సేని వాడుకోవచ్చు. అసలు కండల వీరుడు ఎలా స్పందిస్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates